మార్కెట్లకు ఉద్దీపనల కిక్కు

Sat,August 10, 2019 01:02 AM

Sensex ends 254 points higher

-254 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై, ఆగస్టు 9: వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు మదుపరుల్లో జోష్ పెంచింది. ఫలితంగా వారాంతం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ భారీగా లాభపడింది. ఒక దశలో 480 పాయింట్లకు పైగా లాభపడిన సూచీ చివరకు 254.55 పాయింట్లు ఎగబాకి 37,581.91 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ మరో 77.20 పాయింట్లు అందుకొని 11,019.65 వద్దకు చేరుకున్నది. ఈవారంలో సెన్సెక్స్ 463.69 పాయింట్లు, నిఫ్టీ 112.30 పాయింట్లు ఎగబాకాయి. బడ్జెట్‌లో విధించిన సర్‌చార్జీని ఎత్తివేసే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలు కూడా మార్కెట్లలో కొనుగోళ్లకు జోష్‌నిచ్చిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మారుతి, బజాజ్ ఫైనాన్స్, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు 3.36 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్ 7.91 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు టెక్ మహీంద్రా, టాటా మోటర్స్, టాటా స్టీల్, ఐటీసీ, సన్ ఫార్మాలు 2.50 శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఐటీ, ఇతర స్టాకుల్లో ర్యాలీ కొనసాగింది. రంగాలవారీగా చూస్తే ఆటో, ఫైనాన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్, బ్యాంకెక్స్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రెండు శాతం వరకు అధికమయ్యాయి. కాగా, మెటల్, టెక్, టెలికం, ఐటీ, ఇంధనం, యుటిలిటీ, హెల్త్‌కేర్ షేర్లు పతనం చెందాయి. రూపాయి పతనం కొనసాగుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 12 పైసలు పడిపోయి 70.81 వద్దకు చేరుకున్నది.

215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles