మూడో రోజూ అదే జోరు

Thu,March 14, 2019 01:20 AM

-వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు
-సెన్సెక్స్ 217, నిఫ్టీ 40 పాయింట్లు వృద్ధి
-ఆర్థిక, ఇంధన షేర్లు ఆకర్షణీయం
ముంబై, మార్చి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనం మధ్య కూడా బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 216.51 పాయింట్లు పుంజుకుని 37,752.17 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 40.50 పాయింట్లు పెరిగి 11,341.70 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు రోజుల్లోనూ దేశీయ సూచీలు భారీ లాభాలనే అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక, ఇంధన రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో మూడో రోజూ సూచీలు లాభాల్లోనే పయనించాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 4.15 శాతం పెరుగగా, యెస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3.67 శాతం వరకు లాభపడ్డాయి. అయితే భారతీ ఎయిర్‌టెల్ షేర్ విలువ గరిష్ఠంగా 4.08 శాతం నష్టపోయింది. వేదాంత, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా షేర్లూ 3.48 శాతం మేర క్షీణించాయి.

ఆయా రంగాల వారీగా బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ, ఎనర్జీ షేర్లు 1.42 శాతం వరకు లాభపడితే, టెలికం, మెటల్, పవర్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ సూచీలు 2.60 శాతం మేర నష్టపోయాయి. అయినప్పటికీ విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడుల రాక, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం వంటివి మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయని ట్రేడింగ్ విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం రూపాయి విలువ మరో 17 పైసలు పుంజుకున్నది. మంగళవారం కూడా 18 పైసలు పెరిగిన సంగతి విదితమే. ఇక గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,080.74 పాయింట్లు, నిఫ్టీ 306.30 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో షాంఘై సూచీ 1.09 శాతం, జపాన్ 0.99 శాతం, కొరియా 0.41 శాతం, హాంకాంగ్ 0.39 శాతం చొప్పున దిగజారాయి. ఐరోపా మార్కెట్లలోనూ జర్మనీ 0.05 శాతం నష్టపోయింది. అయితే ఫ్రాన్స్ 0.32 శాతం, బ్రిటన్ 0.04 శాతం చొప్పున పెరిగాయి.

నష్టాల్లో విమానయాన షేర్లు

డీజీసీఏ తీసుకున్న నిర్ణయం.. స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ షేర్లను ముంచేసింది. బుధవారం ట్రేడింగ్‌లో ఆ సంస్థల షేర్ విలువ 2 శాతానికిపైగా నష్టపోయింది. ఒకానొక దశలో స్పైస్‌జెట్ షేర్ విలువ ఏకంగా 8 శాతం వరకు క్షీణించినా.. తిరిగి కోలుకున్నది. చివరకు బీఎస్‌ఈలో రూ.77.15 వద్ద స్థిరపడింది. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన సేవలను నిలిపివేయాలని భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారం నిర్ణయం తీసుకున్నది. దీంతో స్పైస్‌జెట్ 12 మ్యాక్స్ 8 విమానాలు నిలిచిపోయాయి. గురువారం కూడా మరో 35 విమానాలు నిలిచిపోతున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 5 విమానా లూ నిలిచిపోగా, ఆ సంస్థ షేర్ విలువ బీఎస్‌ఈలో 2.06 శాతం నష్టంతో రూ.240. 60 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 4 శాతం వరకు నష్టపోవడం గమనార్హం. అయితే ఇండిగో షేర్ విలువ మాత్రం 2.11 శాతం పెరిగింది. బీఎస్‌ఈలో దీని షేర్ విలువ రూ.1,301.45గా ఉన్నది.

1329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles