సూచీలకు ఐటీస్టాక్స్ దన్ను

Tue,June 11, 2019 12:53 AM

Sensex ends 169 pts higher

-169 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై, జూన్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మెక్సికోతో అమెరికి వాణిజ్య యుద్ధమేఘాలు కొలిక్కిరానున్న సంకేతాలతో ఐటీ రంగ షేర్లకు అనూహ్యంగా మద్దతు లభించింది. దీంతో ఈ వారం ప్రారంభరోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 168.62 పాయింట్లు(0.43 శాతం) లాభపడి 39,784.52 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ మరో 52.05 పాయింట్లు అందుకొని 11,922.70 వద్ద ముగిసింది. నిధుల లభ్యత అంతంత మాత్రంగానే ఉండటంతో బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థల పరిస్థితి ఆందోళన స్థాయికి చేరుకోవడంతో ఆర్థిక రంగ షేర్లను విక్రయించడానికి మదుపరులు ఎగబడ్డారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయడంతో ఒక దశలో దిగువముఖం పట్టింది. చివరకు ఐటీ రంగ షేర్ల దన్నుతో లాభాల్లోకి మళ్లింది. స్టాక్ మార్కెట్లో టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్‌టీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్‌ల షేర్లు 2.39 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్, టాటా మోటర్స్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు మూడు శాతం వరకు పడిపోయి టాప్ లూజర్‌గా నిలిచాయి. రంగాల వారీగా చూస్తే టెక్, ఎఫ్‌ఎంసీజీ, టెలికం, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ రంగ షేర్లు 1.61 శాతం వరకు పెరిగాయి. చమురు, గ్యాస్, ఇంధనం, ఆర్థిక, బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని 1.20 శాతం వరకు నష్టపోయాయి. మధ్యస్థాయి షేర్లు లాభాల బాట పట్టగా, చిన్న స్థాయి షేర్లు మాత్రం పతనం చెందాయి. మొండి బకాయిలను గుర్తించడానికి 30 రోజులు గడువునిస్తూ గతవారం చివర్లో రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లలో చిన్న స్థాయి ప్రకంపనాలను సృష్టించింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లు భారీగా పతనం చెందుతున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో షింఘై కంపొజిట్ ఇండెక్స్ స్వల్పంగా లాభపడగా, హ్యాంగ్‌సంగ్ 2.27 శాతం, నిక్కీ 1.20 శాతం, కోస్పీ 1.31 శాతం పెరిగాయి.

ఆర్‌ఐఎల్‌ను దాటేసిన టీసీఎస్

దేశీయ అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిలిచింది. ఇప్పటివరకు తొలిస్థానంలో కొనసాగిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కినెట్టి టీసీఎస్ అత్యంత విలువైన సంస్థగా సోమవారం అవతరించింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,37,194.55 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నమోదైన రూ.8,36, 024.08 కోట్ల కంటే రూ.1,170.47 కోట్లు అధికం. టీసీఎస్ షేరు విలువ 2.39 శాతం లాభపడి రూ.2,231.10 వద్ద ముగిసింది. కాగా, ఆర్‌ఐఎల్ షేరు విలువ మాత్రం రూ.1,318.85 వద్ద స్థిరంగా ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.6,66.533.49 కోట్లు), హెచ్‌యూఎల్ (రూ.4,00,325.83 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.3,78,236.52 కోట్లు)లుగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్ల ట్రేడింగ్ ఆధారంగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మారుతుంటాయి.

462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles