కొనుగోళ్ల జోష్

Mon,March 11, 2019 11:59 PM

Sensex crosses 37,000 mark

-37 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
-383 పాయింట్లు లాభపడిన సూచీ

ముంబై, మార్చి 11: బుల్ మళ్లీ రంకెసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎన్నికల జోష్ ముందే కనిపించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ సర్కార్ మళ్లీ గెలిచే అవకాశాలున్నట్లు విశ్లేషకుల అంచనాలతో మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఆరు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో సెన్సెక్స్ మళ్లీ 37 వేల మార్క్‌ను దాటింది. ప్రారంభం నుంచే లాభాల బాట పట్టిన సూచీ..ఏ దశలోనూ వెనక్కితిరిగి చూసుకోలేదు. ఇదే క్రమంలో 37 వేల పాయింట్లు దాటి 37,054.10 వద్ద ముగిసింది. గత ముగింపుతో పోలిస్తే 382.67 పాయింట్లు లేదా 1.04 శాతం లాభపడినట్లు అయింది. గతేడాది సెప్టెంబర్ 19న నమోదైన 37,121.22 పాయింట్లకు చేరువైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 132.65 పాయింట్లు(1.20 శాతం) లాభపడి 11,168.05 వద్ద ముగిసింది. ఈ సూచీ కూడా ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో సూచీలకు మరింత జోష్‌నిచ్చిందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన రెండు వారాలుగా భారీగా అమ్మకాలు జరిగిన మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లకు మదుపరుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో బుల్ భారీగా పుంజుకున్నాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడిదారులు కూడా భారీగా నిధులను కుమ్మరించడం, భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరుల్లో జోష్ పెంచిందని మార్కెట్ పండితులు వెల్లడించాయి. విద్యుత్, చమురు-గ్యాస్, పీఎస్‌యూ, మెటల్, బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, మౌలిక సదుపాయాలు, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన షేర్లకు అధిక డిమాండ్ నెలకొన్నది.

దూసుకెళ్లిన ఎయిర్‌టెల్


టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా లాభపడింది. కంపెనీ షేరు ధర 8.08 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. పవర్ గ్రిడ్ కూడా 3.90 శాతం లాభపడింది. వీటితోపాటు కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, యెస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకీ, కొటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, ఐటీసీ, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు 3.80 శాతం వరకు లాభపడ్డాయి. కానీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇంద్ బ్యాంక్, ఇన్ఫోసిస్‌లు తగ్గుముఖం పట్టాయి. నిధులు లేక సతమతమవుతున్న ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.2 వేల కోట్ల రుణం ఇవ్వనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించడంతో కంపెనీ షేరు ధర అమాంతం పెరిగింది. ఇంట్రాడేలో 4.68 శాతం లాభపడిన షేరు ధర చివరకు 2.04 శాతం లాభంతో రూ.248.05 వద్ద స్థిరపడింది. రంగాల వారీగా చూస్తే ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ 2.85 శాతం, మెటల్ 2.50 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.32 శాతం, పీఎస్‌యూ 2.30 శాతం, ఆటో 2.24 శాతం, పవర్ 2.04 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 1.75 శాతం, హెల్త్‌కేర్ 1.54 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.19 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.05 శాతం, రియల్టీ, బ్యాంకెక్స్, ఎఫ్‌ఎంసీజీ, టెక్‌లు లాభపడ్డాయి.


మరింత బలపడ్డ రూపాయి


స్టాక్ మార్కెట్లతోపాటు రూపాయి విలువ మరింత బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు ఎగబాకి రూ.69.89 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్‌ఐఐలు భారీగా పెట్టుబడులు పెట్టడం దేశీయ కరెన్సీ బలపడటానికి దోహదం చేసింది. రూ.69.99 వద్ద ప్రారంభమైన మారకం విలువ ఒక దశలో రూ.69.82 గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. యూరోతో పోలిస్తే రూ.78.57కి, పౌండ్‌తో పోలిస్తే రూ.90.79 వద్ద ముగిసింది.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles