వెంటాడిన భయాలు

Sat,February 9, 2019 12:34 AM

Sensex crashes over 400 points

-భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-సెన్సెక్స్ 425, నిఫ్టీ 126 పాయింట్లు పతనం
-మదుపరుల్లో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఆందోళనలు

ముంబై, ఫిబ్రవరి 8: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. మరోసారి దేశీయ స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. అగ్రరాజ్యాల వ్యాపార సంఘర్షణ.. అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్లీ ఆందోళనలకు దారితీయగా, శుక్రవారం ఈ ప్రభావం భారతీయ మార్కెట్లలో ప్రస్ఫుటంగా కనిపించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ వరుసగా నాలుగో రోజు 14 పైసలు కోలుకున్నా.. తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఏడాదిన్నర తర్వాత కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించినా.. ఆ జోష్ మాత్రం మదుపరుల్లో కనిపించలేదు. ఈ క్రమంలోనే సూచీలు భారీ నష్టాలకు లోనవగా, మదుపరుల భయాల నడుమ ఆటో, మెటల్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 424.61 పాయింట్లు పతనమై 36,546.48 వద్దకు చేరితే, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 125.80 పాయిం ట్లు క్షీణించి 10,943.60 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభం నుంచి నష్టాల్లోనే కదలాడుతున్న సూచీలు.. ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా నష్టాలతో మొదలవగా.. సమయం గడుస్తున్నకొద్దీ ఈ నష్టాలు తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మదుపరులను లాభాల స్వీకరణ వైపు నడిపించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. టాటా మోటర్స్ షేర్ విలువ అత్యధికంగా 17.93 శాతం పతనమవగా, వేదాంత, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, మారుతి సుజుకీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ 5.75 శాతం వరకు నష్టపోయాయి. మెటల్ సూచీ గరిష్ఠంగా 3.42 శాతం క్షీణిస్తే, ఆటో రంగ షేర్లు 3.37 శాతం దిగజారాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లూ నష్టాలకే పరిమితమయ్యాయి. కాగా, ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 77.05 పాయింట్లు, నిఫ్టీ 49.95 పాయింట్లు లాభపడ్డాయి.

ఉలిక్కిపడ్డ గ్లోబల్ మార్కెట్లు


అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో టాటా మోటర్స్ నష్టం ఏకంగా రూ.27 వేల కోట్లదాకా నమోదవడానికి తోడు పరస్పర సుంకాలపై అమెరికా-చైనా అధ్యక్షుల మధ్య జరుగుతాయన్న సంప్రదింపులపై నెలకొన్న అయోమయం స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జీ జిన్‌పింగ్‌లు వాణిజ్య యుద్ధ చర్చలు జరుపాల్సి ఉన్నా.. ఇంకా ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించట్లేదన్న వైట్‌హౌజ్ వర్గాల ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రతీకార సుంకాల అమలుకు విధించుకున్న మార్చి 1 గడువులోగా అధినాయకుల మధ్య చర్చలు జరుగుతాయని, ఫలప్రదం అవుతాయంటూ కలలు కన్న మదుపరుల ఆశలపై గురువారం వైట్‌హౌజ్ సలహాదారు చేసిన ప్రకటన నీళ్లు చల్లింది. ఈ క్రమం లో ప్రధాన ఐరోపా దేశాల జీడీపీ అంచనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా మదుపరులను కలవరపెట్టింది. దీంతో అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా సూచీల్లో జపాన్ 2.19 శాతం, కొరియా 1.20 శాతం, హాంకాంగ్ 0.16 శాతం చొప్పున పడిపోయాయి. ఐరోపాలోనూ జర్మనీ 0.10 శాతం దిగజారగా, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు మాత్రం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.

కోలుకున్న ఆర్‌కామ్ షేర్లు


దయనీయ పరిస్థితుల్లో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మదుపరులకు కాస్త ఊరట లభించింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఆర్‌కామ్, గ్రూప్‌లోని మరికొన్ని ఇతర షేర్లు 11.2 శాతం మేర పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో ఆర్‌కామ్ షేర్ విలువ 4.82 శాతం కోలుకుని రూ.5.44 వద్దకు, ఎన్‌ఎస్‌ఈలో 4.80 శాతం పెరిగి రూ.5.45 వద్ద ముగిసింది. అలాగే రిలయన్స్ క్యాపిటల్ షేర్ 11.23 శాతం, రిలయన్స్ పవర్ 9.55 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 6.54 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 5.78 శాతం చొప్పున బీఎస్‌ఈలో లాభాలను చవిచూశాయి.

టాటా మోటర్స్ విలవిల


డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో దేశీయ ప్రముఖ ఆటో రంగ సంస్థ టాటా మోటర్స్ ఏకంగా రూ.26, 960.8 కోట్ల నష్టాలను ప్రకటించడం.. ఆ సంస్థ షేర్లను భీకర అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 18 శాతం నష్టాలు వాటిల్లాయి. బీఎస్‌ఈలో 17.28 శాతం దిగజారి రూ.151.30 వద్ద స్థిరపడగా, ఒకానొక దశలో రూ.141.90 వద్దకు చేరింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 17.88 శాతం కోల్పోయి రూ.150.15 వద్ద నిలువగా, ఇంట్రా-డేలో రూ.129 కనిష్ఠాన్ని తాకింది. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్ విలువ రూ.9,123.41 కోట్లు హరించుకుపోగా, ప్రస్తుతం బీఎస్‌ఈలో సంస్థ మార్కెట్ విలువ రూ.43,685.59 కోట్లుగా ఉన్నది. టాటా మోటర్స్ నష్టం బీఎస్‌ఈ లిస్టింగ్ సంస్థల చరిత్రలోనే అతిపెద్దది కావడం గమనార్హం. దాంతో మదుపరులు తీవ్ర ఆందోళనకు గురవగా, ఆ ప్రభావం మొత్తం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పైనా కనిపించింది. టాటా మోటర్స్ లగ్జరీ వాహనాల బ్రాండ్, ఇబ్బందుల్లో ఉన్న జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఆస్తుల్లో ఏర్పడిన ఆకస్మిక బలహీనత.. సంస్థ నష్టాలను అమాంతం పెంచేసింది. గత ఆర్థిక సంవత్సరం (2017-18) అక్టోబర్-డిసెంబర్‌లో రూ.1,214.6 కోట్ల లాభాన్ని టాటా మోటర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రూ.13 వేల కోట్లు నష్టపోయాం: అనిల్


తమ సంస్థల షేర్లు నష్టాలకు గురికావడానికి కారణం ఎల్‌అండ్‌టీ, ఎడిల్‌వైస్ సంస్థల అక్రమ కార్యకలాపాలేనని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఆరోపించింది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌తోపాటు ఎడిల్‌వైస్ గ్రూప్‌లోని కొన్ని సంస్థలు.. స్టాక్ మార్కెట్లలో ఉన్న రిలయన్స్ గ్రూప్ సంస్థల షేర్లను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా నష్టపరిచారన్నది. నాలుగు రోజుల్లో తమ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ రూ.13,000 కోట్లు తరిగిపోయిం దన్నది. కాగా, ఎల్‌అండ్‌టీ, ఎడిల్‌వైస్ సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో అనిల్ అంబానీ గ్రూప్ స్పష్టం చేసింది.

రూ.1.67 లక్షల కోట్లు ఆవిరి


స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల మధ్య మదుపరుల సంపద శుక్రవారం ఒక్కరోజే రూ.1.67 లక్షల కోట్లు ఆవిరైపోయింది. సెన్సెక్స్ 424.61 పాయింట్లు పడిపోయి న నేపథ్యంలో ఆయా సంస్థల మార్కెట్ విలువ రూ.1,67, 594.92 కోట్లు తగ్గిపోయి రూ.1,41,07,190.48 కోట్లకు చేరింది. 30 షేర్లున్న సెన్సెక్స్‌లో 25 షేర్లు నష్టాలపాలయ్యాయి. గరిష్ఠంగా నష్టపోయిన టాటా మోటర్స్ మార్కెట్ విలువే రూ.9, 000 కోట్లకుపైగా హరించుకుపోయింది. బీఎస్‌ఈలో 1,616 షేర్లు నష్టాల్లో ముగియగా, 923 షేర్లు లాభాలను అందుకున్నాయి. 111 షేర్లు మాత్రం క్రితం ముగింపుతో పోల్చితే యథాతథంగా ఉన్నాయి. మొత్తంగా 321 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి.

1681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles