కోలుకున్న సూచీలు


Tue,February 13, 2018 01:05 AM

-294 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- పది సెషన్లలో రెండోసారి లాభపడ్డ మార్కెట్లు

sensex
ముంబై, ఫిబ్రవరి 12: సార్వత్రిక బడ్జెట్, అమెరికా దెబ్బకు ఢీలా పడిన దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ వారం ప్రారంభ రోజు సూచీలు భారీగా లాభపడ్డాయి. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు అంచనాలకుమించి నమోదు చేసుకోవడం, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గనున్నదన్న అంచనాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయ పరిణామాలు కూడా తోడవడంతో సూచీలు భారీగా లాభపడటానికి దోహదపడినట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గడిచిన ఆరు రోజులుగా చమురు ధరలు దిగువముఖం పట్టడం, రూపాయి బలపడటం సూచీలకు మరింత కిక్కునిచ్చింది. ఇంట్రాడేలో 34,351.34 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఒక దశలో మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడటంతో 34,115.12 కనిష్ఠ స్థాయిని తాకింది.

యూరప్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూలతతో చివరకు 294.71 పాయింట్లు (0.87%) లాభపడి 34,300.47 వద్ద స్థిరపడింది. గత శుక్రవారం సూచీ 407.40 పాయింట్లు (1.18 శాతం) పడిపోయి నెల కనిష్ఠ స్థాయి 34,005.76కి జారుకున్న విషయం తెలిసిందే. ఇంట్రాడేలో 10,555.50 స్థాయిని తాకిన నిఫ్టీ..ముగిసే సమయానికి 84.80 పాయింట్లు ఎగబాకి 10,539.75 వద్ద ముగిసింది. గడిచిన పది సెషన్లలో కేవలం రెండు రోజులు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మూడో త్రైమాసికానికిగాను నికర లాభం ఐదు రెట్లు పెరుగడంతో టాటా స్టీల్ షేరు ధర 4.22 శాతం లాభపడానికి కారణమైంది. టాటా కమ్యూనికేషన్స్ 1.71 శాతం, ఎల్ అండ్ టీ 1.63 శాతం లాభపడ్డాయి.

వీటితోపాటు యెస్‌బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇంద్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, మారుతి, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, బజాజ్, సన్‌ఫార్మాలు 2.89 శాతం వరకు లాభపడ్డాయి. కానీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ షేరు ధర 2.67 శాతం పతనం చెందింది. రంగాల వారీగా చూస్తే ఇంధనం(1.87 శాతం), రియల్టీ (1.73 శాతం), క్యాపిటల్ గూడ్స్(1.65 శాతం), మౌలికం(1.47 శాతం), హెల్త్‌కేర్ (1.18 శాతం), ఆటో(1.06 శాతం), మెటల్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లను కొనుగోలు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ మదుపరులు ఆసక్తి చూపారు. కానీ, ఐటీ, టెక్ రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది.

నేడు మార్కెట్లకు సెలవు

శివరాత్రి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌తోపాటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, ఫారెక్స్, మనీ, బులియన్, మెటల్స్, ఆయిల్‌సీడ్స్, చక్కెర మార్కెట్లు మూసివేసివుంచనున్నారు.

316

More News

VIRAL NEWS