32 వేలు దాటిన సెన్సెక్స్

Wed,September 13, 2017 12:58 AM

Sensex closes 276 points up Nifty rises Tata Steel Sun Pharma top gainers

sensex
10,100 చేరువలో నిఫ్టీ
ముంబై, సెప్టెంబర్ 12: స్టాక్ మార్కెట్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతోపాటు దేశీయ ఆర్థిక రంగానికి సంబంధించి కీలక గణాంకాల నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 32 వేల మార్క్‌ను దాటింది. ప్రారంభం నుంచి లాభాల బాట పట్టిన సూచీలు నెల గరిష్ఠానికి చేరుకున్నాయి. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276.50 పాయింట్లు(0.87 శాతం) లాభపడి 32,158.66 వద్దకు చేరుకుంది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐ) భారీగా నిధులను కుమ్మరించడం సూచీలు 32 వేల మార్క్‌ను దాటడానికి దోహదపడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 7న తర్వాత సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు. గడిచిన మూడు సెషన్లలో సెన్సెక్స్ 220.19 పాయింట్లు లాభపడిన విషయం తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 10,100 పాయింట్లకు చేరువైంది.

చివరకు 87 పాయింట్లు(0.87 శాతం) లాభపడి 10,093.05 వద్ద స్థిరపడింది. ఇంచుమించు ఆగస్టు 1న ముగిసిన 10,114.65 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియా ఉద్రిక్త పరిస్థితులు, హ్యురీకేన్ తుఫాన్ నుంచి అమెరికాకు ముప్పు తప్పడంతో యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభపడ్డాయి. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన యూరప్ సూచీలు కూడా లాభాల బాట పట్టడం కూడా దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. టాటా స్టీల్ 3.30 శాతం పెరిగి ఆరేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. యూకే బిజినెస్‌కు చెందిన బ్రిటిష్ స్టీల్ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి నూతనంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించడంతో కంపెనీ షేరు ధర భారీగా పుంజుకున్నది. సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌ల షేర్లు కూడా మూడు శాతానికి పైగా లాభపడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్ 2.26 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.66 శాతం, కొటక్ బ్యాంక్ 1.57 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.48 శాతం, ఐటీసీ 1.37 శాతం, సిప్లా 1.37 శాతం వరకు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, టీసీఎస్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీపోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, మారుతి, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు చెందిన షేర్లు పెరిగాయి. విప్రో 1 శాతం తగ్గగా, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌లు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ రెండు శాతానికి పైగా లాభపడగా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో 25 లాభపడగా, ఐదు నష్టపోయాయి.

రికార్డు స్థాయికి బీఎస్‌ఈ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ

బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన నాలుగు రోజులుగా స్టాక్ మార్కెట్లు ఎగువముఖం పట్టడంతో లిైస్టెన సంస్థల విలువ కూడా భారీగా పెరుగుతున్నది. దీంతో మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి విలువ రూ.1,35,83,958 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు ఎగువముఖం పట్టడం సూచీలు పుంజుకోవడానికి పరోక్షంగా దోహదపడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అధినేత వినోద్ నాయర్ తెలిపారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్-టీసీఎస్‌ల మధ్య దోబుచులాట

స్టాక్ మార్కెట్లో లిైస్టెన అత్యంత విలువైన సంస్థల ర్యాంకులు స్వల్పకాలంపాటు తారుమారయ్యాయి. మధ్యాహ్నం వరకు రెండో స్థానాన్ని చేజిక్కించుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..మార్కెట్ ముగిసే సమయానికి మూడో స్థానానికి పడిపోయింది. టీసీఎస్ షేరు ధర పెరుగడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ రూ.4,73,530.72 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో టీసీఎస్ విలువ రూ.4,72,733.32 కోట్లకు జారుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి టీసీఎస్ విలువ హెచ్‌డీఎఫ్‌సీ కంటే రూ.2,578.86 కోట్లు అధికంగా రూ.4,76,045.04 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5,35,509.87 కోట్లతో తొలి స్థానంలో దూసుకుపోతున్నది. మూడో స్థానంలో ఐటీసీ(రూ.3,38,064.40 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ(రూ.2,86,404.51కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

495

More News

VIRAL NEWS