వాల్ స్ట్రీట్ సెగకు దలాల్ స్ట్రీట్ ఫ్రై

Fri,October 12, 2018 12:57 AM

Sensex and Nifty end 2 percent lower amidst global sell off and weak rupee

-రూ. 2,869.41 కోట్లు అమ్మిన ఎఫ్‌ఐఐలు
-చమురు కంపెనీలకు లాభాలు
-బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ, ఆటో, మెటల్ షేర్లకు భారీ నష్టాలు
-ఆవిరైన రూ. 2.69 లక్షల కోట్ల సంపద
--ఆదుకోని రూపాయి రికవరీ

వాల్‌స్ట్రీట్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ కుదేలైంది. మరో సారి భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇటీవల కాలంలో సెన్సెక్స్ ఒక్క రోజులోనే అత్యధిక పతనాన్ని నమోదు చేసింది. బుధవారం వచ్చిన లాభాలన్నింటినీ హరించి వేసింది. మొత్తం రూ. 2.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గ్లోబల్ మార్కెట్లన్నీ భారీ నష్టాలతో ట్రేడ్ అవుతూ వుండడంతో దేశీయ మార్కెట్లు ప్రారంభంలోనే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగు తర్వాత అత్యంత కనీస స్థాయిలో నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ ఒకదశలో 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది. 33,723 స్థాయిని తాకింది. అయితే మధ్యాహ్నం దాకా చాలా వరకు నష్టాలనుంచి బయటపడినప్పటికీ చివరి గంటన్నరలో వచ్చిన తాజా అమ్మకాల వత్తిడితో సెన్సెక్స్ నికరంగా 759.74 పాయింట్ల నష్టంతో 34,001.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 225.45 పాయింట్ల నష్టంతో 10,234.65 వద్ద ముగిసింది. చమురు రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. పతనం కేవలం అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగానే జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

స్టాక్‌మార్కెట్లకు పెద్దన్న వాల్‌స్ట్రీట్ గత రాత్రి ఏకంగా 831 పాయింట్లు నష్టపోవడంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పుకూలాయి. ఏడు నెలల తర్వాత అతిపెద్ద పతనాన్ని డోజోన్స్ ఇండెక్స్ నమోదు చేసింది. 1.3 లక్షల కోట్ల అమెరికన్ బాండ్లను చైనా అమ్మేసిందన్న వార్తలు గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా డాలర్ పతనానికి దారితీసింది. దేశీయ కారణాలతో గత నెల రోజులుగా మన మార్కెట్లు పతనం కాగా, గురువారం పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలు కారణమయ్యాయి. ముడిచమురు ధరలు గత మూడు రోజులుగా పతనం అవుతుండడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు నిఫ్టీలో టాప్ గెయనర్స్‌గా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ ఏకంగా 5.16 శాతం నష్టపోయింది. కాగా, మెటల్ ఇండెక్స్ 3.84 శాతం, ఐటీ ఇండెక్స్ 3.04 శాతం, ఆటో ఇండెక్స్ 2.48 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.12 శాతం చొప్పున నష్టపోయాయి. మిడ్‌క్యాప్-100 ఇండెక్స్ 2.34 శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్100 ఇండెక్స్ 2.11 శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1,292 షేర్లు నష్టాల్లో ముగిస్తే కేవలం 517 షేర్లు లాభాల్లో ముగిసాయి.

dalaal-street

హెచ్‌పీసీఎల్ 16.21 శాతం, ఐవోసీ 5.77 శాతం, బీపీసీఎల్ 4.84 శాతం, గెయిల్ 4.06 శాతం లాభంతో ముగిసాయి. నిఫ్టీలో కేవలం 9 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి. ఇండియాబుల్స్ హౌజింగ్ 9.12 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 6.20 శాతం, ఎస్‌బీఐ 6.08 శాతం, టాటా స్టీల్ 4.99 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఐఐలు భారీగా అమ్మకాలు జరిపారు. మొత్తం రూ. 2,869.41 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో కేవలం 8 ట్రేడింగ్ సెషన్లలోనే రూ.16,535.43 కోట్ల అమ్మకాలు అయ్యాయి. మరోవైపు డీఐఐలు కేవలం రూ.1,888. 18 కోట్ల అమ్మకాలే చేశారు.

ఎస్‌ఐపీలే బెస్ట్

మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌ఐపీ పెట్టుబడులకు చాలా అనుకూలం. స్వల్పకాలిక రుణ సాధానల్లో మదుపు మంచి రాడులను ఇస్తుంది. ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీముల్లో ఎస్‌ఐపీ ద్వారా మదుపు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యుత్తమ మదుపు వ్యూహం. స్మాల్‌క్యాప్ షేర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పటికీ ఓవర్ వాల్యూజోన్‌లోనే ఉన్నాయి. వీటి జోలికి ఇప్పట్లో వెళ్లకపోవడమే మేలు. 2011-13 సంవత్సరాల మధ్య ఉన్న పరిస్థితులే పునరావృతం అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్‌లో రాబడులను రాబట్టం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మూడు నుంచి ఐదేండ్ల కాలపరిమితితో మదుపు చేయడం ప్రారంభిస్తే ఫలితం ఉండొచ్చు. డోజోన్స్, 22,000 స్థాయికి , ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ 2500 స్థాయికి పతనం కావచ్చు. ఆ దశలో ఇండియన్ మార్కెట్‌లో కూడా అవకాశాలు కనిపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురుధర పెరుగుదల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థపై ఏటా అదనంగా రూ. 3.6 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ భా రాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుందనేదానిపై ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారపడి వుంది. ఎన్నికల సంవత్సరం కనుక సహజంగానే మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తుతా యి. గత నెల రోజుల పతనం చాలా వేగంగా ఉన్నప్పటికీ నిఫ్టీ 9000 స్థాయిని దిగిపోవడానికి అవకాశాలు లేవు.

-ఎస్.నరేన్,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
ఛీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్

ఆసియా మార్కెట్లు కుదేలు

అమెరికన్ మార్కెట్ల పతనం ప్రపంచమార్కెట్లనీ కుదిపేసింది. చైనా స్టాక్ మార్కెట్ నాలుగేండ్ల కనీస స్థాయికి పతనం అయింది. జపాన్, కొరియా, అస్ట్రేలియా మార్కెట్లూ కుప్పకూలాయి. జపాన్ నిక్కై ఇండెక్స్ నాలుగు శాతం నష్టపోగా మిగిలిన ఆసియా దేశాల సూచీలన్నీ ఇదే దారిలో భారీ పతనాలను నమోదు చేశాయి. అమెరికన్ ఫెడరల్‌రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల కార్పొరేట్ల రుణ భారం పెరుగుతుందనీ, తద్వారా రాబడులు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు చాలా వేగంగా పెరుగుతున్నాయని జెపీ మోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్ గ్లోబల్ మార్కెట్స్ వ్యూహకర్త మార్సెల్లా ఛౌ అభిప్రాయ పడ్డారు. షాంగై కాంపోజిట్ ఇండెక్స్ ఏకంగా 5.2 శాతం నష్టపోగా, హ్యాంగ్సెంగ్ 3.7 శాతం, దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ 4.4 శాతం నష్టపోగా, అస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 2.7 శాతం నష్టపోయింది.

668
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles