కోలుకున్న స్టాక్ మార్కెట్లు

Sat,June 8, 2019 01:11 AM

Sensex and Nifty closed with minor gains

-86 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

ముంబై, జూన్ 7: స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు మార్కెట్లు లాభాల్లోకి రావడానికి దోహదపడ్డాయి. నిధులు లేక ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనడంతో 400 పాయింట్ల స్థాయిలో తచ్చాడిన మార్కెట్లు వారాంతం ట్రేడింగ్ ముగిసే సమయానికి 86.18 పాయింట్లు లాభపడి 39,615.90 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 26.90 పాయింట్లు ఎగబాకి 11,870.65 వద్దకు చేరుకున్నది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 98.30 పాయింట్లు, నిఫ్టీ 52.15 పాయింట్లు పతనం చెందాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, వేదాంతాలు రెండు శాతం వరకు బలపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల షేర్లు 2.37 శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. నిధులు లేక ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో మదుపరులు బ్యాంకింగ్ రంగ షేర్లను విక్రయించడానికి మొగ్గుచూపగా, అలాగే రూపాయి పతనంతో ఐటీ రంగ షేర్లు కూడా పతనాన్ని మూటగట్టుకున్నాయి. ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిరేటును మళ్లీ పునరుత్తేజం చేయడానికి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పావుశాతం తగ్గించినప్పటికీ మార్కెట్లు పెడచెవిన పెట్టాయని, వాణిజ్య యుద్ధ భయాలతో యూరోపియన్ మార్కెట్లలో అలజడికి కారణమైందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాల వారీగా చూస్తే టెలికం, ఫైనాన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్, బ్యాంకెక్స్, టెక్ రంగాల షేర్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. కానీ, యుటిలిటీ, ఇంధనం, హెల్త్‌కేర్, రియల్టీ, మెటల్ షేర్లు మాత్రం ఒక్కశాతానికి పైగా లాభపడ్డాయి.


422 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వులు

విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. మే 31తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.875 బిలియన్ డాలర్లు పెరిగి 421.867 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ ఇంతేస్థాయిలో 1.99 బిలియన్ డాలర్లు పెరిగి 419.99 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. వీటిలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.946 బిలియన్ డాలర్లు ఎగబాకి 394.134 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ 13, 2018న ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వులు రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడిచిన కొన్ని వారాలుగా నిలకడ వృద్ధిని నమోదు చేసుకుంటున్న పసిడి రిజర్వులు గతవారంలో 62.9 మిలియన్ డాలర్లు తగ్గి 22.958 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని సెంట్రల్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.


రూపాయి మరింత పతనం

దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కె ట్లో క్రూడాయిల్ మళ్లీ భగ్గుమనడంతో నెలకొన్న ఆందోళను ఫారెక్స్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. దీంతో బ్యాం కర్లు, దిగుమతిదారులు డాలర్‌ను కొనుగోలు చేయడానికి ఎగబడటంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 18 పైసలు పతనం చెంది 69.46 వద్దకు జారుకున్నది. ప్రారంభంలో భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు కరెన్సీ పతనానికి ఆజ్యంపోసింది. 69.23 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఒక దశలో 69.52 స్థాయికి పడిపోయింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 18 పైసలు కోల్పోయి 69.46 వద్ద ముగిసింది. ఈవారం మొత్తానికి మాత్రం కరెన్సీ విలువ 24 పైసలు లాభపడింది. ఫ్యూచర్ మార్కె ట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారె ల్ ధర 1.62 శాతం బలపడి 62.67 డాలర్లు పలికింది.

600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles