ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్

Wed,October 23, 2019 05:09 AM

- సెన్సెక్స్ 335, నిఫ్టీ 73 పాయింట్ల పతనం
ముంబై, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. వరుసగా ఆరు రోజులపాటు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన మార్కెట్లకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపంలో తగిలిన దెబ్బకు కుదేలైంది. ఇన్ఫీలో సీనియర్ ఉన్నతాధికారులు అనైతికానికి పాల్పడుతున్న సిబ్బందే బోర్డుకు ఫిర్యాదు చేయడం దలాల్‌స్ట్రీట్ వర్గాల్లో ఆందోళనను పెంచింది. ఇన్ఫీలో విశాల్ సిక్కా విషయం మరువకముందే సలీల్ పరేఖ్ ఉదాంతం బయటకు పొక్కడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 39 వేల మార్క్ దిగువకు పడిపోయింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీ సమయం గడుస్తున్న కొద్ది తీవ్ర ఒత్తిడికి గురైంది. మధ్యాహ్నానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా తోవడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 334.54 పాయింట్లు(0.85 శాతం) పతనం చెంది 38,963.84 వద్ద ముగిసింది.


ఇంట్రాడేలో 38,924.85ని తాకిన సూచీ ఒక దశలో 39,426.47 గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 73.50 పాయింట్లు పతనం చెంది 11,588.35 వద్దకు జారుకున్నది. ఇన్ఫోసిస్ షేరు ధర అత్యధికంగా 16.21 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు టాటా మోటర్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫైనాన్స్‌లు మూడు శాతానికి పైగా పతనం చెందాయి. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీలు మూడు శాతంకు పైగా మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లులో అమ్మకాలు పోటెత్తడంతో ఈ రంగ సూచీ ఏడు శాతానికి పైగా నష్టపోయింది. టెలికం, మెటల్, వాహహన రంగ షేర్లు కూడా నష్టాల పాలయ్యాయి.

మరోవైపు హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. అతిపెద్ద బ్లూచిప్ కంపెనీల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగగా, ఇన్ఫోసిస్ దెబ్బకు సెన్సెక్స్ 39 వేల దిగువకు, నిఫ్టీ 11,600 స్థాయి కంటే కిందకు పడిపోయాయని మార్కెట్ పండితులు వెల్లడిస్తున్నారు. బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడినప్పటికీ, ఐటీ రంగ షేర్లు కుదేలవడం మొత్తం పతనాన్ని శాసించిందన్నారు. మహారాష్ట్ర, హర్యాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి పట్టం పట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మార్కెట్ల పతనాన్ని ఏ మాత్రం ఆపలేకపోయాయి. మరోవైపు, గత కొన్ని రోజులుగా పతనాన్ని నమోదు చేసుకుంటున్న రూపాయి ఎట్టకేలకు కోలుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి రూ.70.94 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడాయిల్ కూడా 59.17 డాలర్ల వద్ద ముగిసింది.

దూసుకుపోయిన అవంతి షేరు

హైదరాబాద్‌కు చెందిన దాణా తయారీ సంస్థ అవంతి ఫీడ్స్ షేరు దూసుకుపోతున్నది. గడిచిన ఆరు సెషన్లలో కంపెనీ షేరు ధర 26.32 శాతం రిటర్నులు పంచింది. గతేడాదికాలంలో 21.86 శాతం పెరిగిన షేరు ధర..ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 17.49 శాతం లాభపడింది. అక్టోబర్ 22, 2009న రూ.1.47గా ఉన్న కంపెనీ షేరు ధర ప్రస్తుతం రూ.450.60కి చేరుకున్నది. గడిచిన పదేండ్లకాలంలో కంపెనీ షేరు ఏకంగా 30,553 శాతం రిటర్నులు పంచింది. 2009లో సంస్థకు చెందిన లక్ష రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసుంటే ప్రస్తుతం ఇవి రూ.3.06 కోట్లకు చేరుకోనున్నదన్న మాట. మంగళవారం కూడా కంపెనీ షేరు ధర మరో 10.35 శాతం బలపడి రూ.450.60 వద్ద ముగిసింది. రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 155 శాతం పెరిగి రూ.118.69 కోట్లకు చేరుకోవడం, అమ్మకాలు 41.66 శాతం అధికమై రూ.1,085.28 కోట్లకు చేరాయి.

305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles