రూ. 2.94 కోట్లు కొట్టేశారు


Wed,October 11, 2017 11:48 PM

నకిలీ పత్రాలతో షేర్ల అమ్మకాలు.. ఆదిత్య బిర్లా సంస్థ మేనేజర్ అరెస్ట్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నమ్మకస్తులని షేర్లలో మదుపు చేస్తే, ఆ మదుపరికే తెలియకుండా నకిలీ దృవీకరణ పత్రాలు సృష్టించి రూ. 2.94 కోట్లు కాజేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన మేనేజర్‌ను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాచిగూడకు చెందిన శ్రీనివాసచారి వృత్తిరీత్యా వైద్యుడు. కొన్నేండ్ల క్రితం బేగంపేట్‌లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన సంస్థ ద్వారా పలు కంపెనీల షేర్లు కొనుగోలు చేశాడు. అయితే వీటి వివరాలను ఆ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ ఆర్ శ్రావణ్‌కుమార్, ఆయన సహాయకుడు లక్ష్మిదీపక్‌లు సేకరించారు.

శ్రీనివాసచారి మనుమడు డాక్టర్ విజయ్‌ని కలిసి వాటిని విక్రయిస్తే భారీగా డబ్బులు వస్తాయని సూచించారు. కొన్ని షేర్లు విక్రయించి ఆ డబ్బులను విజయ్‌కు ఇచ్చారు. నకిలీ దృవీకరణ పత్రాల ద్వారా విజయ్, శ్రీనివాసచారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి మిగిలిన షేర్లను విక్రయించారు. ఇలా వచ్చిన రూ. 2.94 కోట్లను తమ ఖాతాల్లోకి మార్చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు విజయ్‌కి అసలు విషయం తెలిసింది. దీనిపై ఆయన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన ఇన్స్‌పెక్టర్ రవీందర్‌రెడ్డి మేనేజర్ శ్రావణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, దీపక్ కోసం గాలింపు చేపట్టారు.

120

More News

VIRAL NEWS