మదుపరిని వెంటాడిన భయాలు

Tue,November 14, 2017 12:33 AM

Selling pressure grips Sensex as it ends 281 pts lower

- పారిశ్రామికోత్పత్తిలో మందగమనమే కారణం
-సెన్సెక్స్ 281 పాయింట్లు పతనం
sensex
ముంబై, నవంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు.. స్థూల ఆర్థిక మందగమన పరిస్థితుల మధ్య మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టపోక తప్పలేదు. ఫలితంగా సెన్సెక్స్ 281 పాయింట్లు పతనమై మూడు వారాల కనిష్ఠాన్ని తాకుతూ 33,033.56 వద్ద ముగియగా, నిఫ్టీ 96.80 పాయింట్లు క్షీణించి 10,224.95 వద్ద స్థిరపడింది. పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు పడిపోవడం మదుపరుల్లో భయాందోళనలకు దారితీసింది. ట్రేడింగ్ అనంతరం రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడుతుండటం కూడా మదుపరులను అమ్మకాల ఒత్తిడిలోకి నెట్టింది. సెప్టెంబర్‌కుగాను గత వారం విడుదలైన ఐఐపీ గణాంకాలు 3.8 శాతానికే పరిమితమైనది తెలిసిందే. గతేడాది ఇదే నెలలో 5 శాతంగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులోనూ 4.5 శాతంగా నమోదైంది. దీంతోనే దిగజారుతున్న పారిశ్రామిక ప్రగతి.. మార్కెట్ వరుస లాభాలకు బ్రేక్ వేసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఇటీవలి సమావేశంలో పలు వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను భారాన్ని తగ్గించినా మదుపరులు పట్టించుకోలేదన్న ఆయన మిడిల్-ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితులూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలూ దేశీయ మార్కెట్ల తీరుతెన్నులను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, టెలికం రంగ షేర్లు అత్యధికంగా 1.94 శాతం నష్టపోగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ షేర్లూ క్షీణించాయి.

ఆకట్టుకోని న్యూ ఇండియా అస్యూరెన్స్

స్టాక్ మార్కెట్లలో సోమవారం లిస్టింగ్ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. రూ.800 వద్ద షేర్ల లిస్టింగ్ జరుగగా, బీఎస్‌ఈలో 9.36 శాతం పతనమై రూ.725.05 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో గరిష్ఠంగా 10.28 శాతం పడిపోయాయి. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ రూ. 59,7 44.12 కోట్ల వద్ద ఉంది.

నేడు ఖాదిమ్ ఇండియా లిస్టింగ్

ఫుట్‌వేర్ రిటైలర్ ఖాదిమ్ ఇండియా షేర్లు.. మంగళవారం స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అవుతున్నాయి. గత వారమే రూ.543 కోట్ల ఐపీవో ముగియగా, రూ.745-750 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఇష్యూ.. 1.90 రెట్లు అధికంగా స్పందనను అందుకుంది.

భారత్ 22 ఈటీఎఫ్ ప్రారంభం నేడే

రూ.8,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న భారత్ 22 ఈటీఎఫ్.. మంగళవారమే మొదలవుతున్నది. ఇది ఈ నెల 17న ముగియనుండగా, యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మంగళవారం నుంచి, నాన్-యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 15 నుంచి బిడ్ల స్వీకరణ జరుగనుంది. భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, సూతీ కంపెనీలతో భారత్ 22 ఈటీఎఫ్ ఏర్పడినది తెలిసిందే

195

More News

VIRAL NEWS