ఎస్బీఐ పండుగ బొనాంజా

Tue,September 10, 2019 03:45 AM

SBI cuts FD rates by 20 25 bps MCLR by 10 bps

-వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
-ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇది ఐదోసారి
-డిపాజిట్లపైనా పావు శాతం వడ్డీరేట్లు కోత

ముంబై, సెప్టెంబర్ 9: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు పండుగ బొనాంజాను అందిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పండుగ సీజన్‌లో నగదు సరఫరాను పెంచే ఉద్దేశంలోభాగంగా వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలా వడ్డీరేట్లను తగ్గించడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఇప్పటి వరకు 40 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను తగ్గించినట్లు అయింది. ఈ నూతన వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై విధిస్తున్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు 8.25 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గనున్నది. బ్యాంకింగ్ రంగంలో ఇదే తక్కువ స్థాయి వడ్డీ కావ డం విశేషం. ఇప్పటికే అన్ని రకాల రుణాలను రెపో రేటుకు లింక్ చేసిన బ్యాంక్..డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో కూడా కోత విధించింది.

టర్మ్ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్..బల్క్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఇవి కూడా మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో 5 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంక్..మే, జూలై నెలలో ఇంతే స్థాయిలో కోత విధించింది. ఆ తర్వాతి నెల ఆగస్టులో ఏకంగా 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణరేటు 8.25 శాతానికి తగ్గింది. తాజాగా మరో పది బేసిస్ పాయింట్లు కోత విధించడంతో రేటు 8.15 శాతానికి తగ్గినట్లు అయింది. బ్యాంకింగ్ రంగంలో ఇదే తక్కువ స్థాయి వడ్డీ. ఎస్బీఐకి పోటీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 8.30 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా, అదే ఐసీఐసీఐ బ్యాంక్ 8.35 శాతం ఇస్తున్నది. ఈ రెండు బ్యాంకులు గడిచిన రెండు వారాల్లో తమ వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించాయి.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles