రూపాయి విలవిల

Thu,November 14, 2019 12:34 AM

-62 పైసలు తగ్గి 72.09 స్థాయికి పడిపోయిన మారకం

ముంబై, నవంబర్‌ 13: రూపాయి విలవిలలాడింది. దేశ ఆర్థిక పరిస్థితులు నీరుగారుతుండటం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతున్నట్లు వచ్చిన సంకేతాలతో మారకం విలువ రెండున్నర నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఒకేరోజు 62 పైసలు దిగజారి రూ.72.09 వద్దకు జారుకున్నది. బలహీనంగా ప్రారంభమైన కరెన్సీ విలువ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. ప్రారంభంలోనే 72 స్థాయికి పడిపోయిన విలువ ఇంట్రాడేలో 72.10 కనిష్ఠ స్థాయికి పతనం చెందింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 62 పైసలు కోల్పోయి 72.09 వద్ద ముగిసింది. సెప్టెంబర్‌ 4 తర్వాత కరెన్సీకి ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. కరెన్సీ విలువ వరుసగా మూడు రోజులుగా దిగువముఖం పడుతున్నది. పారిశ్రామిక వృద్ధిరేటు పాతళానికి పడిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తంకావడంతో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ హెడ్‌ వీకే శర్మ తెలిపారు. విదేశాల్లో డాలర్‌కు అనూహ్యంగా మద్దతు లభించడంతో రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచిందన్నారు. హాంకాంగ్‌లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడం కూడా పతనానికి ఆజ్యం పోసింది. ఇతర ఆరు కరెన్సీలు స్వల్పంగా లాభపడ్డాయి. మరోవైపు గ్లోబల్‌ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర 1.18 శాతం తగ్గి 61.33 డాలర్ల వద్ద ముగిసింది.

444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles