ఇక వేగంగా విదేశీయానం

Fri,October 12, 2018 01:00 AM

RGIA gets new interim terminal for international departures

-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ అందుబాటులోకి
-పెరిగిన అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నిర్మించిన జీఎంఆర్
-గత నాలుగేండ్లలో రెట్టింపైన విదేశీయుల రాకపోకలు
-వ్యాపార లావాదేవీల కోసం వచ్చేవారే ఎక్కువ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గత నాలుగేండ్లలో రెట్టింపైంది. వ్యూహాత్మక ప్రదేశంలో హైదరాబాద్ ఉండటం వల్ల శంషాబాద్ విమానాశ్రయం ఏటా 24 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జీఎంఆర్ ప్రత్యేకంగా అంతర్జాతీయ టెర్మినల్‌ను ప్రారంభించింది. దీని సాయంతో ఇక ప్రపంచ దేశాలకు హైదరాబాద్ నుంచి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. ఇక్కడ్నుంచి విదేశాలకు వెళ్లేవారు కొత్త టెర్మినల్‌నే వినియోగించాల్సి ఉంటుంది. సాధారణంగా భద్రతా సిబ్బంది ఒక్కో ప్రయాణీకుడిని క్షుణ్ణంగా తనిఖీచేసిగానీ లోపలికి అనుమతించడానికి వీల్లేదు. అయితే ఇందుకు అధిక సమయం పడుతున్నది. కానీ ఇక ఈ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేందుకు జీఎంఆర్ ఆధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. ఫలితంగా హ్యాండ్ బ్యాగేజీ తనిఖీ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. రిమోట్ సాయంతో ఈ పనిని వేగంగా చేపట్టడానికి వీలు కలుగుతున్నది.

int-deparatures

విదేశీ నగరాలతో పోటీ..

హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి ప్రత్యేక గుర్తింపు లభిస్తున్నది. ఆయా రంగాల్లో తన ప్రాధాన్యతను చాటుతూ ప్రముఖ విదేశీ నగరాల సరసన చోటు సంపాదించడానికి పోటీ పడుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ నగరానికి విచ్చేసిన తర్వాత హైదరాబాద్ విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా జీఎంఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రీమియం చెకిన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మొదటి తరగతి, వ్యాపార శ్రేణికి చెందిన ప్రయాణీకులకు ప్రత్యేక వ్యక్తిగత సదుపాయాల్ని కల్పించింది. చెక్-ఇన్ ప్రక్రియలో సాయం అందిస్తున్నది. వీరి కోసం టెర్మినల్‌లోనే ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ, కస్టమ్స్ అధికారులుంటారు. ఈ ప్రక్రియలన్నీ సులువుగా జరిగేందుకు సాయం చేస్తారు. ప్రాథమిక ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ప్రయాణీకులు ఎలివేటర్లు, ఎస్కలేటర్ల ద్వారా మెయిన్ టెర్మినల్ బిల్డింగ్‌లోకి ప్రవేశించవచ్చు.

అక్కడే షాపింగ్, లాంజ్ సదుపాయాలు వంటివి అందుకోవచ్చు. కొత్తగా విదేశీ టెర్మినల్ ప్రారంభం కావడంతో ఇక్కడికే హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ దుకాణాన్ని మార్చేసి ఆధునీకరించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయంలో గత నాలుగేండ్ల నుంచి ప్రయాణీకుల రద్దీ రెట్టింపయ్యిందన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దనే ఉద్దేశంతోనే కొత్తగా విదేశీ టెర్మినల్‌కు శ్రీకారం చుట్టామన్నారు. సీఈవో ఎస్‌జీకే కిశోర్ మాట్లాడుతూ పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాన్ని విస్తరిస్తామన్నారు. ఆధునిక సొబగులను అద్దుతామన్నారు.

int-deparatures2

* ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 22 అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఆయా విదేశీ ప్రాంతాలకు రాకపోకల్ని సాగిస్తున్నాయి.
* ప్రతిరోజు 5,500 మంది విదేశీ ప్రయాణీకులు వచ్చిపోతున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా 29 నగరాలకు భాగ్యనగరం నుంచి నేరుగా విమాన సౌకర్యం అందుబాటులో ఉన్నది.
* కొత్తగా ఆరంభించిన విదేశీ టెర్మినల్ సౌకర్యం హజ్ టెర్మినల్ ఫెసిలిటీకి చేరువలోనే ఉంటుంది.
* ప్రయాణీకులు శ్రీశైలం హైవే, శంషాబాద్ రహదారి నుంచి కొత్త టెర్మినల్‌కు సులువుగా చేరుకోవచ్చు.

2414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles