స్థూల ఆర్థికాంశాలు కీలకం

Mon,August 12, 2019 02:32 AM

Review On Stock Markets In This Week

-నేడు, గురువారం మార్కెట్లకు సెలవు
-ఈవారం స్టాక్ మార్కెట్లపై సమీక్ష

న్యూఢిల్లీ, ఆగస్టు 11: గతవారంలో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారంలో ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు అంచనావేస్తున్నారు. ఈవారంలో విడుదలకానున్న స్థూల ఆర్థికాంశాలకు తోడు వృద్ధికి ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వచ్చిన అంచనాలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. సోమవారం బక్రీద్ సందర్భంగా మూసివేయనున్న స్టాక్ మార్కెట్లు.. గురువారం స్వాతంత్య్ర దినోత్స వం సందర్భంగా సెలవు పాటించనున్నాయి. దీంతో ఈవారంలో ట్రేడింగ్ మూడు రోజులకు పరిమితంకానున్నది. వృద్ధికి ఊతమివ్వడానికి, ఎఫ్‌పీఐల పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపై మదుపరులు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉన్నదని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత విడుదలైన పారిశ్రామిక ప్రగతి గణాంకాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. గనులు, తయారీ రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా జూన్ నెలకుగాను పారిశ్రామిక వృద్ధిరేటు నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పెట్టుబడిదారుల్లో సింటిమెంట్ నిరాశావాదంగా ఉండటంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడులకు లోనయ్యే అవకాశం ఉన్నదని ఆయన వెల్లడించారు. ఈవారంలోనే విడుదలకానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లను ప్రభావితం చేసే అంశామని చెప్పారు. గతవారంలో సెన్సెక్స్ 463.69 పాయింట్లు లేదా 1.24 శాతం పెరిగిన విషయం తెలిసిందే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై విధించిన అదనపు పన్నును వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నదన్న అంచనాతో గతవారం చివరి రెండు రోజుల్లో సెన్సెక్స్ ఏకంగా 891.41 పాయింట్లు లాభపడింది.

రూ.88 వేల కోట్లు పెరిగిన బ్లూచిప్ సంస్థలు

గతవారంలో టాప్-10 బ్లూచిప్ సంస్థల్లో ఏడు అత్యధికంగా రూ.87,965.88 కోట్ల మేర లాభపడ్డాయి. వీటిలో హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు అత్యధిక లాభపడగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల మార్కెట్ విలువ పడిపోయింది. హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) రూ.22,145.92 కోట్లు అధికమై రూ.3,98,290.92 కోట్లకు చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.18,264.93 కోట్లు అధికమై రూ.6,23,892.08 కోట్లకు చేరుకున్నది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ మరో రూ.15,148.15 కోట్లు అధికమై రూ.3,81,619.34 కోట్లకు చేరుకోగా, టీసీఎస్ మరో రూ.14,840.68 కోట్లు ఎగబాకి రూ.8,42,635.51 కోట్లుగా చేరుకున్నది. వీటితోపాటు ఇన్ఫోసిస్ రూ. 6,335.19 కోట్లు అధికమై రూ. 3,39,372.78 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.6,237.72 కోట్లు అందుకొని రూ. 2,71,360.08 కోట్లుగా నమోదైంది. కానీ, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.15,261.10 కోట్లు తగ్గి రూ.2,60,018.56 కోట్లకు జారుకున్నది. వీటితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.14,072 కోట్లు తగ్గి రూ.7,36,602.08 కోట్లకు పరిమితమవగా, ఐటీసీ విలువ కూ.12,606.90 కోట్లు తగ్గి రూ.3,12,146.38 కోట్లకు జారుకున్నది.

ఏడు రోజుల్లోరూ.9 వేల కోట్లు

విదేశీ పెట్టుబడిదారుల నిధుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుత నెల తొలి ఏడు సెషన్లలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.9,197 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. తాజాగా విడుదలైన డిపాజిటరీ నివేదిక ప్రకారం..ఈ నెల 1 నుంచి 9 వరకు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.11,134.60 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు..డెబిట్ మార్కెట్లో మాత్రం రూ.1,937.54 కోట్ల నిధులను చొప్పించారు. అంతకుముందు నెలలో ఎఫ్‌పీఐలు రూ.2,985.88 కోట్లను వెనక్కితీసుకున్నారు. ఎఫ్‌పీఐ పెట్టుబడులపై అధిక పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొత్తం విదేశీ పెట్టుబడిదారులపై ప్రభావం చూపిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా, యూరో, చైనా దేశాల ఆర్థిక పరిస్థితులు నిరాశావాదంగా ఉండటం ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.

240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles