ఆహార ధరలకు రెక్కలు

Wed,March 13, 2019 01:42 AM

Retail inflation to four months high

-నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం
-ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదు

న్యూఢిల్లీ, మార్చి 12: ఆహార పదార్థాల ధరలు మళ్లీ కొండెక్కాయి. గడిచిన కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న కొన్ని ఆహార పదార్థాల ధరలు గడిచిన నెలలో భారీగా పెరుగడంతో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నాలుగు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. అక్టోబర్ 2018లో నమోదైన 3.38 శాతం తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. ఫిబ్రవరి 2018లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.44 శాతంగా ఉన్నది. గతేడాది ఫిబ్రవరిలో 3.26 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణ సూచీ ఈసారి -0.66 శాతానికి తగ్గింది. ఈ ఏడాది తొలి నెలలో నమోదైన కన్జ్యూమర్ ఫుడ్ ధరల సూచీతో పోలిస్తే ఆ తర్వాతి నెలలో స్వల్పంగా పెరిగి 0.15 శాతానికి చేరుకున్నది. ప్రొటిన్ ఆధారిత ఆహార ఉత్పత్తులైన మాంసం, చేప లు, కోడిగుడ్లు మరింత ప్రియమయ్యాయి. గడిచిన నెలలో వీటి ధరలు వరుసగా 5.92 శాతం వరకు ఎగబాకాయి. చిరుధాన్యాలు కూడా 1.32 శాతం పెరిగాయి. కానీ పండ్లు మాత్రం కాస్త శాంతించాయి. గత నెలలో వీటి ధర 4.62 శాతం చౌకవగా, కూరగాయలు -7.69 శాతం తగ్గుముఖం పట్టాయి. జనవరి నెలలోనూ వీటి ధరలు మరింత తగ్గాయి.

ఇంధనం, లైట్ విభాగం ధరల సూచీ 2.20 శాతం నుంచి 1.24 శాతానికి పరిమితమైంది. జనవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాలను 2.05 శాతానికి బదులుగా 1.97 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం 2.57 శాతానికి ఎగబాకగా, మరోవైపు పారిశ్రామిక వృద్ధి 1.7 శాతానికి దిగజారడంతో మరోసారి వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందని ఆర్బీఎల్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త రజిని ఠాకూర్ తెలిపారు. ఆర్థిక రంగం మరింత పరుగులు పెట్టాలంటే వచ్చే నెలలో జరుగనున్న ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం కోత పెట్టాలని ఆయన సూచించారు. ద్రవ్యోల్బణం అంచనావేసిన స్థాయిలోనే నమోదైందని, పలు ఆహార పదార్థాలు భగ్గుమనడం వల్లనే గత నెలకుగాను ధరల సూచీ పెరుగడానికి ప్రధాన కారణమన్నారు. కోర్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిచ్చే అంశమని, నిర్వహణ ఖర్చులు, ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కలిసొచ్చిందని ఆయన చెప్పారు.

1837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles