కూరగాయాలు


Tue,November 14, 2017 12:26 AM

- ఏడు నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
-అక్టోబర్‌లో 3.58 శాతానికి ఎగబాకిన సూచీ
vegetables
న్యూఢిల్లీ, నవంబర్ 13: బహిరంగ మార్కెట్లో ధరాఘాతం తీవ్రత మరింత పెరిగింది. సెప్టెంబర్‌లో 3.28 శాతంగా ఉన్న రిటైల్ ధరల ద్రవ్యోల్బణం గతనెలలో 3.58 శాతానికి ఎగబాకింది. దాంతో సూచీ ఏడు నెలల గరిష్ఠ స్థాయికి పెరిగినైట్లెంది. ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల రేట్లు గణనీయంగా పెరుగడం ఇందుకు కారణమైంది. గత ఏడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.2 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంక శాఖ (సీఎస్‌వో) సోమవారం విడుదల చేసిన డాటా ప్రకారం.. సెప్టెంబర్‌లో 1.25 శాతంగా నమోదైన ఆహార ధరల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.9 శాతానికి ఎగబాకింది. కూరగాయల ధరల పెరుగుదల రేటైతే ఏకంగా రెట్టింపైంది. సెప్టెంబర్‌లో 3.92 శాతంగా ఉన్న కూరగాయల రేట్ల పెరుగుదల గతనెలలో 7.47 శాతానికి ఎగిసింది. కోడిగుడ్లు, పాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే పండ్ల ధరల పెరుగుదల మాత్రం తగ్గుముఖం పట్టింది. పప్పు దినుసుల రేట్లు సైతం మరింత తగ్గాయి. సెప్టెంబర్‌లో -22.51 శాతంగా ఉన్న పప్పు దినుసుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో -23.13 శాతానికి జారుకుంది. ఇంధనం, విద్యుత్ చార్జీలు పెరుగుదలను నమోదు చేసుకొన్నాయి. గృహాల విభాగంలోనూ ద్రవ్యోల్బణం మరింత పుంజుకుంది. జూన్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఏనెలకానెల పెరుగుతూపోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆర్బీఐ పైకి మళ్లింది. వచ్చేనెల 5-6 తేదీల్లో జరుగనున్న ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కీలకం కానుంది.

276
Tags

More News

VIRAL NEWS