ఆర్‌ఐఎల్ @ 5 లక్షల కోట్లు


Tue,July 18, 2017 12:33 AM

చారిత్రాత్మక మైలురాయికి రిలయన్స్ మార్కెట్ సంపద
RelianceIndustries
ముంబై, జూలై 17: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ సంపద రూ.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత ఈ మైలురాయికి చేరుకున్న రెండో సంస్థగా ఆర్‌ఐఎల్ రికార్డు నమోదు చేసుకుంది. సోమవారం నాడు బీఎస్‌ఈలో ట్రేడింగ్ ముగిసేసరికి సంస్థ షేరు ధర 1.33 శాతం పెరిగి రూ.1,551.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.81 శాతం ఎగబాకి రూ.1,558.80 వద్ద మల్టీ ఇయర్ హై లెవెల్‌ను టచ్ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ స్టాకుల రేటు 1.1 శాతం పెరుగుదలతో రూ.1,551.75 వద్ద ముగిసింది. దాంతో ఆర్‌ఐఎల్ మార్కెట్ సంపద మరో రూ.6,672.09 కోట్లు పెరిగి రూ.5,04,458.09 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీ ఇదే. బీఎస్‌ఈలో రిలయన్స్‌కు చెందిన 2.47 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 42 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ ఏడాదిలో ఆర్‌ఐఎల్ షేర్లు 43 శాతం మేర పుంజుకున్నాయి.

తొలిసారిగా 2014లో టీసీఎస్ మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్ల మైలురాయిని తాకింది. తర్వాత కాలంలో రిలయన్స్ షేర్లు క్రమంగా పుంజుకుంటూ రావడంతో గతనెలలో సంస్థ మార్కెట్ సంపద టీసీఎస్ స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం రూ.4,58,605.88 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.4.33 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.3.96 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.2.63 లక్షల కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. షేర్ల ధర ఆధారంగా సంస్థల మార్కెట్ విలువ రోజువారీగా మారుతుంటుంది.

204

More News

VIRAL NEWS