
-రిలయన్స్ గ్రూప్ బోర్డు సమావేశంలో ఎల్అండ్టీ,
-ఎడల్వైజ్లపై ఆర్-క్యాపిటల్ తదితర సంస్థల సిఫార్సు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎడల్వైజ్ గ్రూప్‌పై అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్.. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నది. శనివారం జరిగిన బోర్డు సమావేశంలో స్టాక్ మార్కెట్లలో ఉన్న మూడు రిలయన్స్ గ్రూప్ సంస్థల బోర్డులు.. ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎడల్వైజ్ గ్రూప్‌పై లీగల్ యాక్షన్‌కు సిఫార్సు చేశాయి. తమ భాగస్వాముల ప్రయోజనాల రక్షణార్థం న్యాయ పోరాటం చేసేందుకు నిర్ణయించాయి.
స్టాక్ మార్కెట్లో ఇటీవల తమ గ్రూప్ సంస్థల విలువ పెద్ద ఎత్తున పడిపోవడానికి ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎడల్వైజ్ గ్రూప్‌నకు చెందిన సంస్థలే కారణమని శుక్రవారం రిలయన్స్ గ్రూప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ సంస్థలు గత వారం జరిగిన పరిణామాలపై సమీక్షించాం. మా మదుపరుల సంపద కరిగిపోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం అని తెలియజేశాయి. ఎల్అండ్టీ ఫైనాన్స్‌తోపాటు ఎడల్వైజ్ గ్రూప్‌లోని కొన్ని సంస్థలు.. స్టాక్ మార్కెట్లలో ఉన్న తమ సంస్థల షేర్లను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా నష్టపరిచాయని రిలయన్స్ గ్రూప్ అంటున్నది. తాకట్టుపెట్టిన షేర్లను అమ్మడం ద్వారా ఈ నెల 4 నుంచి 7 వరకు తమ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ సుమారు 55 శాతం పడిపోయి రూ.13,000 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నది. ఈ నాలుగు రోజుల్లో దాదాపు రూ.400 కోట్ల విలువైన తాకట్టు షేర్లను ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎడల్వైజ్ గ్రూపు సంస్థలు అమ్ముకు న్నాయని అంటున్నది. దీనివల్ల 72 లక్షల సంస్థాగత మదుపరులు, రిటైల్ భాగస్వాములకు భారీ నష్టం జరిగిందని పేర్కొంటున్నది.
అక్రమంగా అమ్మలేదు: రుణదాతలు
రిలయన్స్ గ్రూప్ ఆరోపణలు అవాస్తవమని ఆ గ్రూప్ సంస్థలకు రుణాలిచ్చిన ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎడల్వైజ్ గ్రూప్ తీవ్రంగా ఖండించాయి. రుణ, తాకట్టు ఒప్పందాల ప్రకారం రిలయన్స్ గ్రూప్ నడుచుకోలేదని, క్రమం తప్పిన చెల్లింపులపై గతకొద్ది నెలలుగా నోటీసులు పంపిస్తున్నా స్పందించడం లేదని ఎల్అండ్టీ ఫైనాన్స్ ఓ ప్రకటనలో తెలియజేసింది. బకాయిలను రాబట్టుకునేందుకు తాకట్టు పెట్టిన షేర్లను అమ్ముకోవడానికి చట్ట ప్రకారం తమకు అధికారం ఉందని స్పష్టం చేసింది. ఎడల్వైజ్ సైతం ఇదే తీరులో స్పందించింది.