జియో దెబ్బకు ఆర్‌కామ్ విలవిల

Sun,August 13, 2017 12:03 AM

Reliance Communications posts Rs 1210 crore loss in June quarter

క్యూ1లో రూ.1,210 కోట్ల నష్టం

Reliance
న్యూఢిల్లీ, ఆగస్టు 12: అనిల్ అంబానీకి చెందిన టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్నది. తన అన్న ముకేశ్ అంబానీకి చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో దెబ్బకు కంపెనీ విలవిలలాడింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.1,210 కోట్ల నష్టాన్ని చవిచూసింది. రుణభారంతో సతమతమవుతున్న సంస్థకు ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంటతో మరింత కుదేలైంది. జియో ప్రకటించిన టారిఫ్‌ల దెబ్బకు గడిచిన మూడు త్రైమాసికాలుగా నష్టాలనే ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సంస్థ రూ.90 కోట్ల లాభాన్ని గడించింది. టెలికం రంగంలో నెలకొన్న పోటీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ రంగంలో నిస్తేజం నెలకొననున్నదని ఆర్‌కామ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆదాయం విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 33 శాతం క్షీణించి రూ.3,591 కోట్లకు పరిమితమైనట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది రూ.5,361 కోట్లుగా ఉంది. గడిచిన 20 ఏండ్లలో తొలిసారిగా టెలికం రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయని, నిర్వహణ మార్జిన్లు తగ్గుముఖం పట్టడం, వడ్డీల కోసం అధికంగా నిధులు కేటాయించాల్సి రావడం, తరుగుదల అధికంగా ఉండటం, రుణ విమోచన చార్జీలు అధికమవడం, స్పెక్ట్రం కొనుగోలుకు అధిక స్థాయిలో నిధులు వెచ్చించడంతో ఈ రంగంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్‌కామ్ రూ.45 వేల కోట్ల స్థాయిలో అప్పు ఉంది. ఈ నెల చివరినాటికి సిస్టమా శ్యామ్ టెలికం విలీన ప్రక్రియ పూర్తికానున్నదని సంస్థ అంచనావేస్తున్నది.

విలీనం పూర్తయిన తర్వాత ఎనిమిది సర్కిళ్లకు సంబంధించి 30 మెగాహెడ్జ్ స్పెక్ట్రం కంపెనీ వశమవనున్నది. ఈ స్పెక్ట్రం కాలపరిమితి 2033 వరకు ఉన్నది. ఆర్‌కామ్‌లో ఎయిర్‌సెల్ విలీనమవనుండటంతో కంపెనీ అప్పు రూ.14 వేల కోట్లు తగ్గనున్నది. రుణాలను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ..టవర్ల బిజినెస్ బూక్‌ఫిల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో వాటాను విక్రయించడం ద్వారా రూ.11 వేల కోట్లు రావచ్చునని అంచనావేస్తున్నది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 2.12 శాతం తగ్గి రూ.20.75 వద్ద ముగిసింది.

370

More News

VIRAL NEWS