జీఎస్టీ పరిధిలోకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు!

Wed,November 15, 2017 12:34 AM

Registration charges under GST

కేంద్రానికి సూచించిన రాష్ట్ర నిర్మాణ సంఘాలు
registration charges
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) పరిధిలోకి రిజిస్ట్రేషన్ ఛార్జీలను చేర్చాలని రాష్ట్ర నిర్మాణ రంగం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం అందుబాటులోకి వస్తుందని కేంద్రం గొప్పలకు పోతున్నదని విమర్శించారు. జీఎస్టీ కాకుండా.. ఇండ్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసేవారిపై విడిగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేయడమేమిటని నిలదీస్తున్నారు. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే సామాన్యులు 12 శాతం జీఎస్టీతో పాటు ఆరు శాతం రిజిస్ట్రేషన్ చెల్లించాల్సి ఉంటుందని, దీంతో తడిసి మోపడవుతున్నదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను అనే నినాదంతో కేంద్రం గొప్పలు చెబుతూ.. ద్వంద్వ పన్ను విధానానికి తెరలేపిందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి విమర్శించారు. దీంతో దేశంలోని నిర్మాణ రంగంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని ఆయన పేర్కొన్నారు. మధ్యతరగతి కొనుగోలుదారుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌పై స్పష్టత..

జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ ప్రకారం.. ఇండ్లను కొనుగోలు చేసే వారికి ప్రతి నిర్మాణ సంస్థ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అందజేయాల్సి ఉంటుంది. అయితే, దీనిపై అవగాహన పెంచుకోవడానికి నిర్మాణ సంస్థలు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఇండ్లు కొనే వారికిచ్చే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌పై ఎట్టకేలకు స్పష్టత వచ్చిందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. ఇక నుంచి నగరంలో కొనుగోలు చేసే ఫ్లాట్ల మీద సుమారు రెండున్నర శాతం దాకా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అందజేస్తామని రాంరెడ్డి వెల్లడించారు.

క్రెడాయ్ తెలంగాణ సంపద అవార్డులు

నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని చేపడుతున్న నిర్మాణ సంస్థలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా సంపద (రియల్ ఎస్టేట్) అవార్డులను అందజేస్తున్నామని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు జీ రాంరెడ్డి ప్రకటించారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..క్రియేట్-2017 పేరిట ఈ అవార్డులను అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది అక్టోబరు 31లోపు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌లు పొందిన సంస్థలే ఈ అవార్డులకు అర్హులని వెల్లడించారు. వచ్చే నెల 15న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డులకు అర్హులైన సంస్థలను పారదర్శకంగా ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ బాధ్యతను క్రిసిల్‌కు అప్పగించామని తెలిపారు. కొంతకాలం నుంచి నిర్మాణ రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తికి జీవిత సాఫల్య పురస్కారం కూడా అందజేస్తామన్నారు. అవార్డులకు అర్హులైన క్రెడాయ్ సభ్యులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్, ఇతర జిల్లాలకు విడివిడిగా సంపద అవార్డులను అందజేస్తారు.

422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS