ఫిన్‌టెక్‌లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం

Tue,March 26, 2019 12:50 AM

RBI to issue guidelines on regulatory sandbox in next two months

-రెండు నెలల్లో నూతన మార్గదర్శకాలు
-ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

న్యూఢిల్లీ, మార్చి 25: ఆర్థిక సేవల విభాగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంక్ నడుంబిగించింది. వచ్చే రెండు నెలల్లో ఇందుకు అవసరమైన నూతన మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ప్రకటించారు. ఫిన్‌టెక్ స్టార్టప్‌లు రూపొందించిన ఉత్పత్తులను త్వరితంగా విడుదల చేయడం, అతి తక్కువ ఖర్చుతో వీటికి రూపాన్ని ఇవ్వడంలో భాగంగా ఈ నూతన మార్గదర్శకాలకు శ్రీకారం చుడుతున్నట్లు నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చెప్పారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు, తద్వారా ఈ రంగ సంస్థలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగనున్నదన్నారు. 2017 నవంబర్ నుంచి రిజర్వు బ్యాంక్..ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్ సంస్థలకోసం నిర్విరామంగా కృషి చేస్తున్నదన్న ఆయన..ప్రస్తుతం రెగ్యులేటరీ స్యాండ్‌బాక్స్/ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి వీలు పడుతుందన్నారు. ఆర్థిక సేవల విభాగంలో స్టార్టప్‌లకు బోలేడన్ని అవకాశాలున్నప్పటికీ వారికి ఎదురవుతున్న సమస్యలు అవరోధంగా మారాయని, వీటిలో నిర్వహణ ఖర్చులు తగ్గించడం, అనుసంధానం పెంచ డం, నాణ్యమైన ఆర్థిక సేవలు అందించడానికి అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

నిధులు లేక సతమతమవుతున్న ఫిన్‌టెక్ సంస్థలకు ఆర్థికంగా ఆదుకోవాలని బ్యాంకులకు సూచించినట్లు దాస్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ రంగంలో సంస్థలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటిలో డాటా గోప్యత, వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నదని గవర్నర్ సూచించారు. ఆర్థిక సేవల విభాగంలో భారత్ దూసుకుపోతున్నదని, ఇటీవల అంతర్జాతీయ సర్వేలో రెండోస్థానం దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా దాస్ ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్‌లో 1,218 ఫిన్‌టెక్ సంస్థలు ఉన్నప్పటికీ ఇది చాలా తక్కువని, అత్యధిక మందికి ఉపాధి కల్పించే సంస్థలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. డిజిటల్ పేమెంట్స్, ఫిన్‌టెక్ ద్వారా ఆర్థిక అక్షరాస్యత కల్పించడానికి నందన్ నీలేకని నేతృత్వంలోని ఐదుగురితో ప్రత్యేక కమిటీని సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అరుణ్ జైట్లీతో దాస్ భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శక్తికాంత దాస్ సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తున్నది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్బీఐ తన తొలి త్రైమాసిక పరపతి సమీక్షను వచ్చేవారంలో ప్రకటించనుండటంతో వీరు సమావేశం కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏప్రిల్ 2న ప్రారంభంకానున్న ఆరుగురు సభ్యుల పాలసీ కమిటీ 4న పాలసీ నిర్ణయాలను ప్రకటించనున్నది. సమావేశం అనంతరం దాస్ మాట్లాడుతూ..ఇది మర్యాద పూర్వక సమావేశం మాత్రమేనని స్పష్టంచేశారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో వచ్చేనెలలో ప్రకటించనున్న సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని పారిశ్రామిక వర్గాలు అంచనావేస్తున్నాయి.

ఈ వారంలో పేమెంట్ బ్యాంకుల చీఫ్‌లతో..

పేమెంట్ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రిజర్వుబ్యాంక్ రంగంలోకి దిగింది. ఈ వారంలో ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశమవనున్నట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు. 2015లో పేమెంట్ బ్యాంకుల తొలి విడుత జారీ చేసిన లైసెన్సుల్లో ఇప్పటి వరకు ఏడు సంస్థలు సర్వీసులను ఆరంభించాయి. బ్యాంకింగ్ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటికే వాటాదారులు, పలువురు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు స్వీకరించడం జరిగిందని, గతంలోనే బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, వివిధ వర్గాలను కలుసుకోవడం జరిగిందని, ఈ వారంలో పేమెంట్ బ్యాంకుల చీఫ్‌లతో భేటీ కానున్నట్లు నీతి ఆయోగ్ సమావేశం అనంతరం దాస్ చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 195 కోట్ల నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) జరుగగా, వీటి విలువ రూ.172 లక్షల కోట్ల స్థాయిలో ఉందన్నారు. గడిచిన ఐదేండ్లలో జరిగిన లావాదేవీలతో పోలిస్తే ఆరు రెట్లు వరకు అధికం. అలాగే 141 కోట్ల క్రెడిట్ కార్డు, 334 కోట్ల డెబిట్ కార్డు లావాదేవీలు జరిగాయి.

నిధులకు కొరతలేదు: గార్గ్

దేశవ్యాప్తంగా నిధుల కొరత లేదని, అయినప్పటికీ త్వరలో డాలర్-రుపీ రూపంలో మరో రూ.35 వేల కోట్లను విడుదల చేసే అవకాశం ఉన్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకులు స్పష్టంచేశాయి. ద్రవ్యత పరిస్థితి సౌకర్యవంతంగా ఉన్నదని కేంద్ర ఆర్థిక వ్యహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వెల్లడించారు. ఇటీవల రిజర్వు బ్యాంక్ జారీ చేసిన రూపాయి-డాలర్ స్వాప్‌పై ఆయన స్పందిస్తూ..దీంతో మార్కెట్లో ద్రవ్య లభ్యత విరివిగా పెరుగుతున్నదన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో నిధుల కొరత రాకుండా ఉండేందుకు అటు సెంట్రల్ బ్యాంక్, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాయి.

286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles