ఆర్బీఐతో చర్చించాం

Sun,October 13, 2019 02:47 AM

-ఖాతాదారుల ఇబ్బందులు తొలుగుతాయ్
-పీఎంసీ బ్యాంక్ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌తో తాను మాట్లాడానని, ఖాతాదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారని ట్విట్టర్ ద్వారా శనివారం మంత్రి తెలియజేశారు. రికార్డు స్థాయికి పెరిగిన మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ), హెచ్‌డీఐఎల్‌తో బ్యాంక్ అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేసిన నేపథ్యంలో ఆర్బీఐ పీఎంసీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో డిపాజిట్ల ఉపసంహరణలపై రూ.25 వేల పరిమితి పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఖాతాదారులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో మంత్రి ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. పీఎంసీ బ్యాంక్ నుంచి నిర్మాణ రంగ సంస్థ హెచ్‌డీఐఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు మొత్తం 44 రుణాలు తీసుకున్నాయి. గత నెల 19 నాటికి వీటి విలువ రూ.6,500 కోట్లుగా ఉన్నది. బ్యాంక్ మొత్తం రుణాల్లో (రూ.8,880 కోట్లు) ఇది దాదాపు 73 శాతానికి సమానం. అయితే హెచ్‌డీఐఎల్ రుణాలు మొండి బకాయిలుగా మారుతున్నా.. పీఎంసీ బ్యాంక్ పెద్దలు కొత్త రుణాలను ఇస్తూ పోయారని, దీనివల్ల బ్యాంక్‌కు గడిచిన 11 ఏండ్లలో రూ.4,355 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తెలుస్తున్నది. బ్యాంక్ మాజీ మేనేజ్‌మెంట్, హెచ్‌డీఐఎల్ డైరెక్టర్లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేయగా, ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా నియమించిన సంగతీ విదితమే. ఇప్పటికే బ్యాంక్ చైర్మన్, ఎండీలతోపాటు హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కట్టుదిట్టం చేస్తాం

పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో బహుళ రాష్ట్ర సహకార బ్యాంకుల కార్యకలాపాల పరిశీలనకు ఆర్థిక సేవలు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శులు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ త్వరలోనే సమావేశం అవుతారని మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. ఏవైనా చట్ట సవరణలు ఉంటే సూచిస్తారని చెప్పారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో వీటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇంతకుముందు పీఎంసీ బ్యాంక్ వ్యవహారంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని, సహకార బ్యాంకులు ఆర్బీఐ పర్యవేక్షణలో నడుస్తాయని మంత్రి అన్నది తెలిసిందే. అయినప్పటికీ అసలు ఏం జరుగుతున్నదన్నది తెలుసుకోవడానికి గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కార్యదర్శులను ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles