ఇక అంతా లోకల్

Mon,October 15, 2018 12:16 AM

RBI sticks to Oct 15 deadline for data localisation

-భారత్‌లో డేటా స్టోరేజీ గడువుపై వెనక్కి తగ్గని ఆర్బీఐ
-నేటితో ముగిసిన ఆరు నెలల వ్యవధి

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: డేటా లోకలైజేషన్ కోసం అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్) సంస్థలకున్న గడువు సోమవారంతో ముగుస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో ముందుగా నిర్ణయించినట్లే డేటా లోకలైజేషన్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. గ్లోబల్ పేమెంట్ కంపెనీలు తమ భారతీయ కస్టమర్ల లావాదేవీల సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరుచాలని ఆర్బీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇందుకు ఆరు నెలల గడువునివ్వగా, అక్టోబర్ 15తో అదికాస్తా ముగిసింది. అంటే సోమవారం నుంచి ఆర్బీఐ డేటా లోకలైజేషన్ నిబంధనావళి మొదలైందన్నమాట. నిజానికి విదేశీ ఫిన్‌టెక్ సంస్థలు ఈ గడువును పొడిగించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు దేశీయ సంస్థలు మాత్రం ఆర్బీఐ నిబంధనల్ని స్వాగతిస్తున్నాయి. పేటీఎం, ఫోన్‌పే సంస్థలు మద్దతు పలుకుతుండగా, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఆధ్వర్యంలోని గూగుల్ పే వ్యతిరేకిస్తున్నది. స్థానికంగా సర్వర్ల ఏర్పాటు కోసం ఖర్చులు పెరుగుతాయన్న ఆందోళన విదేశీ సంస్థల్లో కనిపిస్తున్నదని, అందుకే దీనికి అవి వెనుకాడుతున్నాయని భారతీయ సంస్థలు అంటున్నాయి.

ఒరిజినల్ డేటాకు బదులుగా ప్రత్యామ్నాయ డేటాను భద్రపరుస్తామని ఆర్బీఐకి విదేశీ సంస్థలు ప్రతిపాదించినా.. ఇందుకు ఆర్బీఐ అంగీకరించలేదు. కనీసం డిసెంబర్‌దాకా సమయమివ్వాలని గూగుల్ కోరుతున్నది. కాగా, ఆర్బీఐ నిబంధనల అమలుకు సిద్ధమని, తమ లోకల్ వ్యవస్థను రూపొందించామని వాట్సాప్ ప్రకటించిన సంగతి విదితమే. వ్యక్తిగత సమాచార భద్రత ముసాయిదా బిల్లులో భాగంగానే ఆర్బీఐ ఈ డేటా లోకలైజేషన్ నిబంధనల్ని తీసుకొచ్చింది. వీటి అమలుపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగోతో సమావేశమైయ్యారు కూడా. కానీ పరిశ్రమ వర్గాలు, ముఖ్యంగా టెక్నాలజీ సంస్థలు ఈ డేటా లోకలైజేషన్‌తో భారత్‌లో వ్యాపార నిర్వహణ పరిస్థితులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కఠిన వైఖరి వద్దు: ప్రధానికి సెనెటర్ల లేఖ

ఆర్బీఐ డేటా లోకలైజేషన్‌పై అమెరికా సెనెటర్లు స్పందించారు. ఈ విషయంలో కఠిన వైఖరి తగదని, కాస్త పట్టు విడువాలని ఇద్దరు సెనెటర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ రకమైన పోకడ భారత్‌లో అమెరికా వ్యాపారాన్నే ప్రభావితం చేయగలదని హెచ్చరించారు. ఆర్బీఐ నిబంధనలు సమాచార స్వేచ్ఛకు విఘాతమని సెనెటర్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ కార్నిన్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన మార్క్ వార్నర్ మోదీకి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఈ నిబంధనలు విదేశీ సంస్థల నిర్వహణ వ్యయాన్ని పెంచుతాయని, సేవలను ప్రియం చేస్తాయన్న సెనెటర్లు.. ఇది భారత సంస్థలకు లాభిస్తుందని, దానివల్ల విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపుతుందన్నారు.

1752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS