మరిన్ని అధికారాలు కావాలి

Wed,June 13, 2018 12:19 AM

RBI needs more powers to oversee PSB

-ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణకు అవసరమన్న ఆర్బీఐ గవర్నర్
-పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట హాజరు

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణకు మరిన్ని అధికారాల అవసరమున్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా గవర్నర్ ఊర్జిత్ పటేల్ అన్నారు. మంగళవారం ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఫైనాన్స్ ఎదుట హాజరైన ఆయన బ్యాంకింగ్ రంగం, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తుండటం, వరుస మోసాలు, కుంభకోణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో పైవిధంగా అభిప్రాయపడ్డారు. కాగా, మొండి బకాయిలు, బ్యాంక్ మోసాలు, నగదు కొరత, ఇతరత్రా అంశాలపై పార్లమెంటరీ ప్యానెల్ నుంచి పటేల్ ప్రశ్నలను ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నామని పటేల్.. కమిటీ సభ్యులకు తెలియజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపైనా ఆర్బీఐకి తగిన పట్టున్నదన్న ఆయన అయినప్పటికీ మరిన్ని అధికారాలు ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇదిలావుంటే పీఎన్‌బీ కుంభకోణంపైనా ఈ సందర్భంగా పటేల్ నుంచి ప్యానెల్ ఆరా తీసింది. దీంతో బ్యాంక్‌లోని ప్రతీ శాఖలో ఏం జరుగుతున్నదని తెలుసుకోవడం చాలా కష్టమని పటేల్ వ్యాఖ్యానించారు.

అయితే దివాలా చట్టం రాకతో మున్ముందు బ్యాంకులకు మొండి బకాయిల బెడద తప్పుతుందన్న విశ్వాసాన్ని మాత్రం వ్యక్తం చేశారు. బ్యాంకు బోర్డుల్లో ఆర్బీఐ నామినీ డైరెక్డర్ ఉండాలన్నదానిపై మాట్లాడుతూ.. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నట్లు చెప్పారు. అయినా ఆర్బీఐ నామినీ ఉండకపోవడమే మంచిదన్నారు. దీనివల్ల ఏదైనా ప్రయోజన వివాదం తలెత్తకుండా ఉంటుందన్నారు. క్రెడిట్ నిర్ణయాలను బ్యాంకుల బోర్డులే తీసుకుంటాయని, దానిలో ఆర్బీఐ తలదూర్చకపోవడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా చాలా ఏటీఎంలలో చోటుచేసుకున్న నగదు కొరతపైనా కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఈ కమిటీ పటేల్ నుంచి వివరణ కోరింది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల వ్యవహారాలపైనా పటేల్‌కు కమిటీ ప్రశ్నల్ని సంధించింది.

795
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles