ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Fri,February 8, 2019 01:17 AM

RBI makes surprise cut in interest rate

-వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
- ఏడాదిన్నర తర్వాత మళ్లీ కోతలు
-పావు శాతం దిగొచ్చిన రెపో, రివర్స్ రెపో
-చౌకవనున్న ఆటో, గృహ రుణాలు

ముంబై, ఫిబ్రవరి 7: ఎవరూ ఊహించనివిధంగా రెపో, రివర్స్ రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్బీఐ తగ్గించింది. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన ఈ ఆర్థిక సంవత్సరపు (2018-19) ఆరో, చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం ముగిసింది. ఇందులో రెపో రేటు (ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు)ను 6.50 శాతం నుంచి 6.25 శాతానికి, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్బీఐ పొందే నగదుపై చెల్లించే వడ్డీరేటు)ను 6.25 శాతం నుంచి 6 శాతానికి దించుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆటో, గృహ తదితర రుణాలు చౌక కానున్నాయి. సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థను ద్రవ్యకొరత, వ్యాపార, పారిశ్రామిక రంగాలను నిధుల లేమి వేధిస్తుండటంతో తల పట్టుకున్న కేంద్రానికి ఏరికోరి తెచ్చుకున్న దాస్ ఈ ద్రవ్యసమీక్షతో కాస్త ఊరటనే కల్పించారు. ఇటీవలి మధ్యంతర బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతులకు రూ.75,000 కోట్ల నగదు సాయాన్ని మోదీ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యతరగతికి ఆదాయం పన్ను (ఐటీ) రిబేటునూ అందించిన సంగతీ విదితమే. ఈ క్రమంలో ఆర్బీఐ వడ్డీరేట్ల కోత.. వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపగలదన్న అంచనాలు ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆరుగురు సభ్యులున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)లో వడ్డీరేట్ల కోతకు 4:2 మద్దతు లభించింది. దాస్‌సహా నలుగురు సమర్థించగా, ఇద్దరు వ్యతిరేకించారు. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడం.. ఆర్బీఐకి వడ్డీరేట్ల కోతకున్న అవకాశాలను మెరుగుపరిచింది. ఇదిలావుంటే ఈ నెలాఖరులోగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) కోసం ఓ నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆర్బీఐ చెప్పింది. అలాగే ఇప్పటికే ఉన్న రుణాలను తీర్చడం కోసం విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) ద్వారా ఆయా సంస్థలు నిధులను సమీకరించుకునేలా అవకాశాన్ని కల్పించాలని కూడా ఆర్బీఐ యోచిస్తున్నది.

వడ్డీరేట్లను ఇంకా తగ్గిస్తాం:దాస్


వడ్డీరేట్లను ఇంకా తగ్గిస్తామని ఆర్బీఐ గవర్నర్ దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే రాబోయే ద్రవ్యసమీక్షల్లో రెపో రేటు మరింత దిగివస్తుందన్న భరోసాను కల్పించారు. గతేడాది మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా రిటైరై డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల్లోకి వచ్చిన దాస్.. తాజా ద్రవ్యసమీక్షలో అనూహ్యంగా కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించి అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అవకాశం ఉంటే కోతలకు కొదవే ఉండదంటూ ద్రవ్యసమీక్ష అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సంకేతాలిచ్చారు. ఇకపోతే వ్యవస్థలో ద్రవ్యకొరతకు ఆస్కారం లేకుండా చేస్తామని, ఏ రంగానికి నిధుల లేమీ సమస్య రాకుండా చూస్తామని ఈ సందర్భంగా దాస్ హామీనిచ్చారు. ఎప్పటికప్పుడు నగదు లభ్యత, ద్రవ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా, మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)పై ఉక్కుపాదం మోపుతూ గతేడాది ఫిబ్రవరి 12న ఆర్బీఐ జారీ చేసిన నిబంధనల్లో ఎలాంటి మార్పూ ఉండదని దాస్ స్పష్టం చేశారు. రుణాల చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా ఎన్‌పీఏగా గుర్తించాలన్న ఈ నిబంధనలపై బ్యాంకర్లు పునరాలోచించాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే.

మధ్యంతర డివిడెండ్ ప్రభుత్వ హక్కు


ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను పొందడం ప్రభుత్వ హక్కు అని దాస్ స్పష్టం చేశారు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య సమీపిస్తున్న ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న కేంద్రం.. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో నిధులను ఆశిస్తుండగా, ఆర్బీఐ నుంచీ మధ్యంతర డివిడెండ్‌ను కోరుతున్నది. దీంతో ఆర్బీఐ చట్టం ప్రకారం మధ్యంతర డివిడెండ్‌ను ఆర్బీఐ వినియోగించుకోవచ్చని దాస్ తెలిపారు. కాగా, రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ రావచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19 జూలై-జూన్)గాను ఆర్బీఐ నుంచి కేంద్రం మధ్యంతర డివిడెండ్‌కు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ తర్వాతి బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 9న జరుగాల్సిన ఈ భేటీ.. 18కి వాయిదా పడిన సంగతి విదితమే.

ముఖ్యాంశాలు-పావు శాతం తగ్గి 6.25 శాతానికి రెపో రేటు
-6 శాతం వద్ద రివర్స్ రెపో
-6.5 శాతంగా బ్యాంక్ రేటు
-4 శాతంగా నగదు నిల్వల నిష్పత్తి యథాతథం
-2019-20 ప్రథమార్ధంలో 3.2-3.4 శాతంగా ద్రవ్యోల్బణం
-వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 7.4 శాతం
-తాకట్టు లేని వ్యవసాయ రుణాల పరిమితి రూ.లక్ష నుంచి 1.6 లక్షలకు పెంపు
-కార్పొరేట్ రుణ మార్కెట్‌లో పెట్టుబడులపై ఎఫ్‌పీఐలకున్న ఆంక్షలు తొలగింపు
-రూపాయి విలువ స్థిరత్వానికి అంతర్జాతీయ మార్కెట్‌లోని రూపీ మార్కెట్‌పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-ఏప్రిల్ 2-4 తేదీల్లో తదుపరి ద్రవ్యసమీక్ష

ద్రవ్యోల్బణ అంచనా కుదింపు


ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ద్రవ్యల్బోణం 2.8 శాతంగా ఉంటుందని ఆర్బీ ఐ అంచనావేస్తున్నది. దేశ ఆర్థిక పరిస్థితులు ఆమోదయోగ్య స్థాయిలో ఉండ టం, వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం వల్లనే ద్రవ్యోల్బణ అంచనాను తగ్గించడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను చివరి రిజర్వు పరపతి సమీక్షను గురువారం సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్న వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో మాత్రం ద్రవ్యోల్బణం 3.2-3.4 శాతం మధ్యలో ఉంటుందని తెలిపింది. ఇదే ఏడాది మూడో త్రైమాసికంలో 3.9 శాతానికి ఎగబాకనున్నది. ఆహార ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా చిరుధాన్యాలు, సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుండటంతో పలు ఆహార పదార్థాలు మరింత చౌకగా లభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. స్వల్పకాలంపాటు ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ఆటుపోటులకు గురికానున్నప్పటికీ దీర్ఘకాలికంగా మాత్రం పెద్దగా ప్రభావం చూపవని పేర్కొంది.

రైతన్నకు ఆర్బీఐ కానుక


-తాకట్టు లేని వ్యవసాయ రుణాల పరిమితి రూ.1.60 లక్షలకు పెంపు
తాకట్టు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.60 లక్షలకు పెంచింది ఆర్బీఐ. ప్రస్తుతం లక్ష రూపాయల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రైతులు వ్యవసాయ రుణాలను పొందవచ్చు. అయితే దీన్ని మరో రూ.60,000 పెంచుతూ తాజా ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. చిన్న, సన్నకారు రైతులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనున్నది. 2010 తర్వాత ఈ రుణాల పరిమితి పెరుగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం రైతుబంధు తరహాలో చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ.6,000 పంట పెట్టుబడి ఇస్తామని ఇటీవలి మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణ యం దేశీయ రైతాంగానికి మరింత ఆర్థిక భరోసాను కల్పించినైట్లెంది. వ్యవసాయ రుణాల సమీక్షకు ఓ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్‌నూ ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నది.
Farmer

వృద్ధికి ఊతం: గోయల్


రెపో రేటును తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ ఊతమిచ్చిందని, ఇక చిన్న వ్యాపారులకు, గృహ కొనుగోలుదారులకు రుణాలు చౌక కానున్నాయని తాజా ఆర్బీఐ ద్రవ్యసమీక్షపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని రంగాలకూ ఈ నిర్ణయం లాభించి ఉద్యోగావకాశాలు పెరుగగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 6.5 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి ఆర్బీఐ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల బ్యాం కుల రుణాలపై వడ్డీరేట్లు తగ్గేందుకు ఆస్కారమున్నది. ఇది చిన్న వ్యాపారులు, గృహ కొనుగోలుదారులకు లాభం అని గురువారం ట్విట్టర్‌లో గోయల్ స్పందించారు.

వచ్చే ఏడాది వృద్ధి 7.4 శాతం


వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని రిజర్వు బ్యాంక్ అంచనావేస్తున్నది. కేంద్ర గణాంకాల శాఖ అంచనావేసిన 7.2 శాతం కంటే ఇది అధికం. బ్యాంకుల వృద్ధిరేటు, కమర్షియల్ రంగంలో ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయంగా నెలకొన్న మందకొడి పరిస్థితులు దేశీయ వృద్ధిరేటును ప్రభావితం చేయనున్నాయని పరపతి సమీక్ష సందర్భంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. డిసెంబర్‌లో జరిగిన సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉంటుందని అంచనావేసిన సెంట్రల్ బ్యాంక్..వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో 7.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. చమురు అధిక దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌పై ఒకవేళ ఇంధన ధరలు భగ్గుమంటే వృద్ధికి వచ్చిన ఢోకా లేదని, డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత, గ్లోబల్‌గా డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఈ ప్రభావం అంతంతేనని పేర్కొంది. ముఖ్యంగా అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ప్రభావంతో గ్లోబల్ వృద్ధికి బీటలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
GDP

ఈఎంఐ ఎంత తగ్గేను..


వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తీసుకున్న కీలక నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర రుణాలను తీసుకున్న వారికి భారీ ఊరట లభించనున్నది. ముఖ్యంగా గృహ రుణా లు తీసుకున్నవారికి ఈఎంఐల భారం నుం చి కాస్త ఉపశమనం లభించనున్నది. రిజ ర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్‌ఆర్) రూపంలో తగ్గించాల్సి ఉంటుంది. గడిచిన ఏడాదిగా వడ్డీరేట్లను అరశాతం వరకు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రుణ గ్రహితలకు ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ శుభవార్తను అందించారు. దీంతో వారి నెలవారి చెల్లింపుల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ఉదాహరణకు పదేండ్ల కాలపరిమితి కలిగిన రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్న వారు ప్రస్తుతం 9.55 శాతం సరాసరిగా వడ్డీరేటును చెల్లిస్తున్నారనుకో. అంటే నెలకు ఈఎంఐల రూపంలో రూ.33,715 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తే రుణరేటు 9.30 శాతానికి తగ్గనున్నది. అంటే ఈఎంఐ రూ.1,639 తగ్గి రూ.32, 076 చెల్లించాల్సి ఉంటుందన్న మాట. అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న వారికి ప్రయోజనం ఎక్కువగా ఉండనున్నది. అలాగే రూ.75 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి ఈఎంఐ రూ.2,177 తగ్గి రూ.64,488కి చేరుకోనున్నది.
tax

బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు


బ్యాంకుల వద్ద బల్క్ డిపాజిట్లపై ఉన్న కోటి రూపాయల పరిమితిని రూ.2 కోట్లకు పెంచుతున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. నిధుల సేకరణకు సం బంధించిన బ్యాంకులకు మరింత స్వే చ్ఛ నివ్వాలనే ఉద్దేశంతో ఈ పరిమితిని పెంచినట్లు తెలిపింది. జనవరి 2013 లో బల్క్ డిపాజిట్లపై పరిమితులు విధించిన ఆర్బీఐ..మళ్లీ ఐదేండ్ల తర్వాత సవరించినట్లు అయింది. అలాగే అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో త్వరలో ఒక ఆర్గనైజేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, క్రెడిట్ సొసైటీస్ లిమిటెడ్‌కు స్వస్తి పలుకబోతున్నది.

చట్టం చూసుకుంటుంది


ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చం దా కొచ్చర్ వ్యవహారాన్ని చట్టం చూ సుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ దాస్ అన్నారు. ఈ అంశంపై తొలిసారి స్పం దించిన ఆయన చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలపై కొచ్చర్ ను బ్యాంక్ తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతున్నదని, దర్యాప్తు సంస్థలే ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తాయన్నారు.

ఎవరేమన్నారు?ఆర్బీఐ నిర్ణయం భేష్. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లపై ఉన్న ఆంక్షల్ని తొలగించడాన్నీ స్వాగతిస్తున్నాం
-సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

మున్ముందు వడ్డీరేట్లు మరింత తగ్గేందుకు అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ణీత స్థాయి కంటే దిగువనే ఉన్నందున రాబోయే సమీక్షల్లో వడ్డీరేట్ల కోతకు వీలున్నది
-రజనీశ్ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్

రెపో రేటు తగ్గింపు నిస్తేజంగా ఉన్న వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో నూతనోత్సాహాన్ని నింపింది. బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి ప్రయోజనాన్ని అందించాలి
-రాకేశ్ భారతీ మిట్టల్, సీఐఐ అధ్యక్షుడు

రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు మరింతగా తగ్గాలి. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి, మందగించిన వృద్ధిరేటు పురోగతికి ఆమోదయోగ్యమైన వడ్డీరేట్లు అవసరం
-సందీప్ సోమని, ఫిక్కీ అధ్యక్షుడు

వడ్డీరేట్ల తగ్గింపు ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రయోజనాన్ని పరిశ్రమకు బ్యాంకులు అందించాలి. మధ్య, భారీతరహా సంస్థల రుణాల విషయంలో ఆర్బీఐ కనికరించాలి
-బాలకృష్ణన్ గోయెంకా,అసోచాం అధ్యక్షుడు
అంతర్జాతీయంగా ఎగుమతిదారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించేలా ఆర్బీఐ చొరవ తీసుకుంటే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించవచ్చు
-రవీ సెహగల్, ఈఈపీసీ ఇండియా చైర్మన్

ఈ సమీక్షలో రెపో రేటు తగ్గింపును ఊహించలేకపోయాం. ఈ క్రమంలో ఏప్రిల్‌లో జరిగే ద్రవ్యసమీక్షలో మరో పావు శాతం తగ్గవచ్చని భావిస్తున్నాం
-రాధికా రావు, డీబీఎస్ గ్రూప్ రిసెర్చ్

ఆర్బీఐ నిర్ణయంతో హౌజింగ్ డిమాండ్ పెరుగొచ్చు. అయితే ఎన్‌బీఎఫ్‌సీ, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ద్రవ్యలభ్యత పెరుగుదలకు ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉన్నది
-జక్సే షా, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు

గృహ నిర్మాణ రంగంలో అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. ద్రవ్యకొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఆర్బీఐ కొత్త ఊపిరిలూదింది.
-నిరంజన్ హీరానందని,నరెడ్కో అధ్యక్షుడు

వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కొనుగోలుదారులకు బదిలీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతాయి.
- గుమ్మి రాంరెడ్డి,క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు

2060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles