నెల రోజుల గడువు

Sat,June 8, 2019 01:17 AM

RBI issues circular on NPAs says defaults need to be recognized

-మొండి బకాయిల గుర్తింపుపై ఆర్బీఐ
-నూతన మార్గదర్శకాలు విడుదల

ముంబై, జూన్ 7: మొండి బకాయిల పరిష్కారానికి రిజర్వు బ్యాంక్ తాజాగా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో జారీ చేసిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలను వ్యక్తంచేసిన రెండు నెలల తర్వాత వీటిని మార్చి మళ్లీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిల గుర్తింపు కాలపరిమితిని 30 రోజులకు పెంచింది. చెల్లించాల్సిన నాటికి ఎలాంటి చెల్లింపులు జరుపని యెడల వీటిని మొండి బకాయిలుగా గుర్తించాలని గతంలో జారీ చేసిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు లెవనేత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తు ఈ నిర్ణయం తీసుకున్నది. గతంలో జారీచేసిన మార్గదర్శకాల స్థానంలో నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. తద్వారా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న కార్పొరేట్ సంస్థలకు, దీర్ఘకాలికంగా ప్రాజెక్టుకోసం భారీ స్థాయిలో నిధులను వెచ్చిస్తున్న సంస్థలకు భారీ ఊరట లభించినట్లు అయింది. ఈ నూతన ఆదేశాలు వెంటనే అమలులోకి రానున్నాయని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ఫిబ్రవరి 12, 2018న జారీ చేసిన మార్గదర్శకాలను ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. నిరర్థక ఆస్తుల గుర్తింపు విషయంలో సెంట్రల్ బ్యాంకుకు సుప్రీంకోర్టుకు మధ్య కొద్దిరోజుల పాటు వాదోపవాదాలు కూడా జరిగాయి. తాము తీసుకున్న రుణానికి తిరిగి చెల్లింపులు జరుపడంలో ఒక్కరోజు జరిగితే వీటిని ఎన్‌పీఏలుగా గుర్తించాలని సెంట్రల్ బ్యాంక్ భావించింది. కానీ, కార్పొరేట్, విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాలకు చెందిన సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కితగ్గింది. చివరకు ఆయా సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి.

ఒకవేళ చెల్లించని యెడల వీటిని 180 రోజులు పరిష్కారం లభించకపోతే వీటిని దివాలా చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. తాకట్టుకింద పెట్టిన ఆస్తులను విక్రయించే అవకాశం ఉంటుంది. బ్యాంకు లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, చిన్న స్థాయి ఆర్థిక సేవల బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని సంస్థలు లేదా వ్యక్తులు ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించింది. 30 రోజుల వరకు ఎలాంటి రిసొల్యుషన్ ప్రణాళికను ప్రకటించే అవకాశాలు లేవు. ఆ తర్వాత నూతన మార్గదర్శకాలో పలు వెసులుబాటు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఖాతాల విషయంలో నూతన మార్గదర్శకాల్లో పలు వెసులుబాటును కల్పించింది సెంట్రల్ బ్యాంక్. 180 రోజుల వరకు చెల్లించే 20 శాతం రుణంలో 35 శాతం ప్రొవిజనింగ్ జరిపించుకునే అవకాశం కల్పించింది. మిగతా 365 రోజుల వరకు 15 శాతం ప్రొవిజనింగ్ లభించనున్నది. బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలైన నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ, చిన్న స్థాయి ఆర్థిక బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద రూ.2 వేల కోట్లకు పైగా తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ నూతన మార్గదర్శకాలు వర్తించనున్నది. రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల లోపు తీసుకున్న రుణాలకు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ మార్గదర్శకాలను వర్తింపు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ తర్వాతి క్రమంలో రూ.1,500 కోట్ల లోపు రుణాలకు కూడా వర్తించనున్నది. అంతకు లోపు తీసుకున్నవాటికి ఇవి వర్తించదు. రుణాలు ఇచ్చే ప్రతిసంస్థ లేదా బ్యాంకులు కూడా అంతర్గత రుణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సూచించింది. మరోవైపు ప్రధాన బ్యాంకులు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్న రుణాలకు చెక్ పెట్టడానికి ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఇతర విషయాల ఆధారంగా రుణాలు ఇవ్వాలని సూచించింది.

విద్యుత్ సంస్థలకు ఇబ్బందే..

ఈ నూతన మార్గదర్శకాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు ఇబ్బందిగా మారాయి. మార్చి 2018 నాటికి ఈ రంగ సంస్థల అప్పులు రూ.5.65 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా జీఎంఆర్ ఎనర్జీ అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యుసర్, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, షుగర్ తయారీదారుల సంఘాలపై కూడా ప్రభావం చూపనున్నది.

2079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles