వడ్డీరేట్లు తగ్గించరా..!

Tue,February 19, 2019 01:16 AM

బ్యాంకుల అధిపతులను 21న అడుగుతా..
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఇటీవలి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను తగ్గించినా.. బ్యాంకర్లు రుణగ్రహీతలకు ఆ ప్రయోజనాన్ని ఆశించిన స్థాయిలో అందించకపోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తీవ్రంగా నిరాశ చెందారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశం కానున్నట్లు సోమవారం దాస్ తెలిపారు. రుణాల వడ్డీరేట్ల తగ్గింపుపై చర్చిస్తానని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. ఆర్బీఐ బోర్డునుద్దేశించి మాట్లాడిన తర్వాత దాస్ విలేఖరులతో మాట్లాడుతూ .. వడ్డీరేట్ల తగ్గింపునకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. రుణగ్రహీతలకు ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రధానంగా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించిన తర్వాత దాని ప్రయోజనం రుణగ్రహీతలకు బదిలీ కావాలి. ఆర్బీఐ తీసుకున్న ప్రతి నిర్ణయంతో చేకూరే లాభాలు అందరికీ అందాలి. కానీ బ్యాంకులు ఈ దిశగా ముందుకెళ్లడం లేదు అన్నారు. నిజానికి ద్రవ్యసమీక్ష తర్వాత ఈ విషయాన్ని మేము స్పష్టం చేశామని, బ్యాంకర్లు కూడా తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి రుణగ్రహీతలకు లాభం చేకూర్చాలని సూచించామని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ స్థాయిలో బ్యాంకర్ల నుంచి స్పందన లేదన్న దాస్.. ఈ విషయంపై గురువారం జరిగే సమావేశంలో అన్ని బ్యాంకుల ఎండీ, సీఈవోలతో చర్చిస్తానని ప్రకటించారు.


ఆర్బీఐ తగ్గించినా..


ఈ నెలారంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రెపో రేటును ఆర్బీఐ పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. 6.25 శాతంగా నిర్ణయించింది. అయితే ఎస్‌బీఐ మాత్రమే 0.05 శాతం మేర స్వల్పంగా కోత విధించాయి. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఆనందం ఆవిరైనైట్లెంది. ముఖ్యంగా ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార, పారిశ్రామిక వర్గాల వ్యతిరేకత తగులకుండా ఉంటుందని ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించింది. కానీ బ్యాంకర్ల తీరుతో ఆ ఆశలపై నీళ్లు చల్లినైట్లెంది. అసలే మొండి బకాయిలు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం నేపథ్యంలో బ్యాం కులు రుణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రుణాలు భారమవగా, ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కూడా అందనీయకుండా బ్యాంకులు వ్యవహరిస్తుండటం ఆర్బీఐకి మింగుడుపడటం లేదు.

మధ్యంతర డివిడెండ్ రూ.28వేల కోట్లు


కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్‌గా రూ.28,000 కోట్లను ఆర్బీఐ ఇవ్వనున్నది. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆర్బీఐ స్పష్టం చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన ఆర్బీఐ కేంద్ర బోర్డు సమావేశంలో ఈ మధ్యంతర డివిడెండ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 31తో ముగిసిన అర్ధ వార్షికానికిగాను ఈ మొత్తాన్ని ఆర్బీఐ.. కేంద్రానికి సమర్పిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత, తగ్గిన ప్రభుత్వ ఆదాయం, లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత వంటి సమస్యల మధ్య ఆర్బీఐ మిగులు నగదు నిల్వల్లో రూ.3.6 లక్షల కోట్లను బదిలీ చేయాలని మోదీ సర్కారు కోరిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు చెలరేగాయి. ఆర్బీఐ, కేంద్రం మధ్య విభేదాలకూ దారితీయగా, గవర్నర్ పదవి నుంచి ఊర్జిత్ పటేల్ తప్పుకోవడం కూడా జరిగింది. దీంతో వెనుకకు తగ్గిన కేంద్రం.. మధ్యంతర డివిడెండ్‌ను కోరింది. ఈ క్రమంలోనే రూ.28 వేల కోట్లు సెంట్రల్ బ్యాంక్ నుంచి ఖజానాకు చేరనున్నాయి.
వరుసగా రెండోసారి..
ఆర్బీఐ ఇలా మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఇవ్వడం వరుసగా ఇది రెండో ఏడాది కావడం గమనార్హం. నిరుడు మార్చి 27న రూ.10,000 కోట్లను మధ్యంతర డివిడెండ్‌గా ఇచ్చింది. నిజానికి 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను అదనంగా రూ.50 వేల కోట్లను కేంద్రానికి ఇవ్వాలని గతేడాది ఆగస్టులోనే ఆర్బీఐ నిర్ణయించింది. 2017-18లో రూ.30,663 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి ఆర్బీఐ అందించింది. జూలై-జూన్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 కింద ప్రభుత్వానికి ఆర్బీఐ తమ లాభాలను, మిగులు నగదు నిల్వలను డివిడెండ్ల రూపంలో పంచుతుంది. కాగా, ప్రస్తుత 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్బీఐసహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ. 74,140 కోట్లను డివిడెండ్ల రూపంలో అందుకోవాలని కేంద్రం బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ.82,911.56 కోట్లుగా నిర్దేశించుకున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం రైతుబంధు తరహాలో ఐదెకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతుకు ఏడాదికి మూడు విడుతల్లో రూ.2,000ల చొప్పున రూ.6,000 అందిస్తామని మోదీ సర్కారు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 12 కోట్ల రైతులకు తొలి విడుత సాయంలో భాగంగా రూ.20,000 కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ మధ్యంతర డివిడెండ్ కేంద్రానికి కలిసి రానున్నది.

మెగా బ్యాంకులు రావాలి: జైట్లీ


దేశానికి ఇప్పుడు ఎక్కువ బ్యాంకుల కన్నా.. భారీ బ్యాంకుల అవసరమే ఎక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సోమవారం ఇక్కడ ఆర్బీఐ కేంద్ర బోర్డు 575వ సమావేశంలో ఆయన ప్రసగించారు. అనంతరం మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలంటే మెగా బ్యాంకుల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న బ్యాంకుల సంఖ్య తగ్గిపోయి, బలమైన బ్యాంకులు రావాలన్నారు. 2017లో ఎస్‌బీఐలోకి దాని ఐదు అనుబంధ బ్యాం కులను, భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసిన సంగతి విదితమే. గత నెలలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లనూ బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిపేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది కూడా. ఈ ఏప్రిల్ 1 నుంచి విలీనం అమల్లోకి రానుండగా, దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి పడిపోనున్నది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల తర్వాత మూడో అతిపెద్ద భారతీయ బ్యాంక్ దేనా, విజయా, బరోడాల కలయికలో వచ్చే బ్యాంకే కానున్నది. కాగా, అమెరికాలో వైద్య చికిత్స కారణంగా ఈసారి మధ్యంతర బడ్జెట్‌ను జైట్లీకి బదులుగా పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తిరిగివచ్చిన జైట్లీ.. మళ్లీ ఆర్థిక శాఖ పగ్గాలను అందుకోగా, బడ్జెట్ ముఖ్యాంశాలను ఆర్బీఐ బోర్డు తాజా సమావేశంలో తెలియపరిచారు. గడిచిన నాలుగున్నరేండ్లలో ప్రభు త్వం చేపట్టిన సంస్కరణలను వివరించారు. బ్యాంకుల విలీనానికి ఉన్న ఆవశ్యకతనూ, లాభాలనూ ఈ సందర్భంగా జైట్లీ వివరించారు. బ్యాంకింగ్ రంగాన్ని.. ము ఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిలకు విలీనాలతోనే అడ్డుకట్ట వేయవచ్చని కేం ద్రం భావిస్తున్నది. డిఫాల్టర్లు వివిధ బ్యాం కుల్లో రుణాలను తీసుకుని ఎగవేస్తున్నారని, ఒక బ్యాంకును మోసం చేసి, మరో బ్యాంకులో ఖాతా తెరిచి, దాన్నీ ముంచేస్తున్నారని సర్కారు వాదిస్తున్నది.

1290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles