వడ్డీరేట్లను తగ్గించరేం?

Fri,February 22, 2019 12:55 AM

RBI governor asked Banks Why are you not cutting lending rates

-బ్యాంకర్లను అడిగిన ఆర్బీఐ గవర్నర్ దాస్

ముంబై, ఫిబ్రవరి 21: కీలక వడ్డీరేట్లను తగ్గించకపోవడానికి కారణాలేంటని బ్యాంకర్లను అడిగి తెలుసుకున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్. ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపో రేటును పావు శాతం మేర తగ్గించినా.. ఆ మేరకు బ్యాంకర్ల నుంచి మాత్రం కోతలు లేవు. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న దాస్.. గురువారం ఈ అంశంపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లతో ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తదితర బ్యాంకర్లు హాజరయ్యారు. ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గించినప్పుడు.. బ్యాంకర్లూ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుంది అని దాస్ అన్నారని సమావేశానికి హాజరైన ఓ బ్యాంకర్ తెలిపారు. ఇక ఈ సమావేశం కేవలం రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యవిధాన ప్రయోజనాల బదిలీ అంశంపైనే జరిగిందని మరో బ్యాంకర్ చెప్పారు. ఈ నెలారంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు మాత్రమే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాయి. అదికూడా అతి స్వల్పంగా 5 బేసిస్ పాయింట్లే. ఈ క్రమంలో వడ్డీరేట్ల కోతలకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడానికి గల కారణాలను తెలుసుకునే పనిలోపడ్డారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
గతంలోనూ ఇదే సమస్య
ఇంతకుముందున్న గవర్నర్లకు, బ్యాంకర్లకు మధ్య కూడా ఇదే వడ్డీరేట్ల కోతపై విభేదాలు చోటుచేసుకున్నాయి. దువ్వూరి సుబ్బారావు, రఘురామ్ రాజన్, ఊర్జిత్ పటేల్‌లు వడ్డీరేట్ల కోతల ప్రయోజనాన్ని.. బ్యాంకులు పూర్తిస్తాయిలో ఖాతాదారులకు అందించడం లేదని ఆరోపించిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలో ఆ జాబితాలోకి దాస్ కూడా చేరిపోయారు. ఇక లోక్‌సభ ఎన్నికలు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అన్ని కీలక రంగాలకు రుణాల మద్దతు లభించేలా బ్యాంకులు చొరవ చూపాలని దాస్ కోరుతున్నారు. ఇదిలావుంటే మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో రుణాల మంజూరు మందగించడం వెనుకు ఉన్న కారణాలనూ దాస్ తెలుసుకున్నట్లు సమాచారం.
అన్నీ కుదిరితే రేట్ల కోతలే
ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే, వృద్ధిరేటు బలోపేతానికి కీలక వడ్డీరేట్లను తగ్గించడానికి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వెనుకాడబోదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇటీవల పావు శాతం వడ్డీరేట్ల తగ్గింపును ఇందుకు ఉదహరించింది. రిటైల్ ద్రవ్యోల్బణం, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టినవేళ.. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లకు రిజర్వ్ బ్యాంక్ కోతలు పెట్టింది. మున్ముందు రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత దిగివస్తే కోతలుంటాయనీ అప్పుడే స్పష్టం చేసింది. తాజాగా గురువారం కూడా ఇదే సంకేతాలనిచ్చింది.

649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles