బ్యాంకర్లకు మరింత స్వేచ్ఛ

Sun,June 9, 2019 12:14 AM

RBI circular a welcome step provides more freedom to bankers

-మొండి బకాయిల తీర్మానంపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలపట్ల ఐబీఏ
న్యూఢిల్లీ, జూన్ 8: మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ల తీర్మానంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన కొత్త సర్క్యులర్‌పట్ల భారతీయ బ్యాంకర్ల సంఘం (ఐబీఏ) హర్షం వ్యక్తం చేసింది. ఒత్తిడిలో ఉన్న ఖాతాలపై నిర్ణయాలు తీసుకోవడంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడింది. ఎన్‌పీఏల తీర్మానంపై తెచ్చిన వివాదాస్పద ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటి ప్రకారం రుణ ఖాతా నిరర్థక ఆస్తిగా ప్రకటించడానికి బ్యాంకులకు 30 రోజుల గడువు లభించింది. ఇంతకుముందు రుణ వాయిదాల చెల్లింపు ఒక్కరోజు ఆలస్యమైనా దాన్ని ఎన్‌పీఏగా ప్రకటించాలని ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉన్న సంగతి విదితమే. 180 రోజుల్లోగా సదరు ఖాతాదారును దివాల కోర్టులకు పంపాలని బ్యాంకర్లకు ఆర్బీఐ నాడు సూచించింది.

బ్యాంకులు, నాబార్డు, ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు రూ.2,000 కోట్లు అంతకుమించి బకాయిపడ్డ రుణగ్రహీతలందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. అయితే దీన్ని అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్‌లో కొట్టేసింది. ఈ క్రమంలో రెండు నెలల తర్వాత ఆర్బీఐ సవరించిన మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. ఆర్బీఐ కొత్త సర్క్యులర్‌ను స్వాగతిస్తున్నాం. రుణదాతలకు సమయానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సర్క్యులర్ ఎంతగానో దోహదపడుతుంది అని శనివారం ఇక్కడ ఓ సెమినార్‌కు హాజరైన సందర్భంగా ఐబీఏ చైర్మన్ సునీల్ మెహెతా అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ సైతం ఆర్బీఐ తాజా సర్క్యులర్ స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు.

నిలకడైన వృద్ధికి అవకాశం: దాస్

మొండి బకాయిల సమస్య పరిష్కారానికిగాను ప్రకటించిన కొత్త మార్గదర్శకాలు.. రుణ సంస్కృతిలో నిలకడైన వృద్ధికి బాటలు వేయగలవన్న విశ్వాసాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు. శనివారం పుణెలో ఎన్‌ఐబీఎం వద్ద జరిగిన మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా 15వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్‌పీఏలపై ప్రభావవంతమైన చర్యలకే ఆర్బీఐ పెద్దపీట వేస్తుందన్నారు. బ్యాంకింగ్ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల సమస్యను పరిష్కరించడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాల్లో పాలనాపరమైన సంస్కరణలపై దృష్టి పెడతామని దాస్ స్పష్టం చేశారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో చోటుచేసుకున్న ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఎన్‌బీఎఫ్‌సీల పర్యవేక్షణ, నియంత్రణకు నడుం బిగిస్తామన్నారు. త్వరలోనే నగదు సంబంధిత అంశాలపై నూతన మార్గదర్శకాలతో వస్తామని తెలిపారు.

2464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles