ఆర్బీఐ బోర్డు భేటీ వాయిదా

Thu,February 7, 2019 12:34 AM

RBI board meeting Postponed Feb 9 to Feb 18

ఈ నెల 9 నుంచి 18కి మార్పు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఈ నెల 9న జరుగాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డు సమావేశం వాయిదా పడింది. 18కి మార్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బోర్డునుద్దేశించి గోయల్ ప్రసంగించనున్నారు. కాగా, కేంద్రానికి ఆర్బీఐ మధ్యంతర డివిడెండ్‌పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19)గాను ఆర్బీఐ నుంచి కేంద్ర ఈ డివిడెండ్‌ను విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే ఆర్బీఐ.. మొదటి ఆరు నెలల లెక్కల్ని పరిశీలించాక మధ్యంతర డివిడెండ్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నది. గత ఆర్థిక సంవత్సరం రూ.10,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇప్పటికే రూ.40,000 కోట్లను అందజేసింది. ఆర్బీఐ మిగులు నగదు నిల్వల్లో రూ.3.5 లక్షల కోట్లను కేంద్రం కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఏర్పడిన విభేదాల మధ్యనే ఆర్బీఐ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ అనూహ్యంగా తప్పుకున్న సంగతీ విదితమే. ఈ క్రమంలో కొత్త గవర్నర్‌గా వచ్చిన శక్తికాంత దాస్ రాబోయే బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడెండ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles