ఇండస్‌ఇండ్‌కు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ దెబ్బ

Wed,January 9, 2019 11:41 PM

RBI asks banks to classify loans to IL and FS as non performing

- క్యూ3లో రూ.985 కోట్ల లాభంతో సరి
న్యూఢిల్లీ, జనవరి 9: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థయైన ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభాలకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ దెబ్బ పడింది. మౌలిక రంగానికి రుణాలు సమకూర్చే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవడంతో బ్యాంక్ లాభాల్లో భారీ వృద్ధిని నిరోధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం కేవలం 5 శాతం పెరిగి రూ.985.03 కోట్లు మాత్రమే ఆర్జించింది. హిందుజా గ్రూపునకు చెందిన బ్యాంక్ గడిచిన కొన్ని త్రైమాసికాలుగా 20-25 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పెద్ద నోట్ల రద్దుచేసిన సమయంలో కూడా రెండంకెల వృద్ధి నమోదు చేసుకున్నప్పటికీ ప్రస్తుత త్రైమాసికంలో నిరాశాజనక పనితీరు కనబరిచే అవకాశం ఉన్నదని బ్యాంక్ ఎండీ, సీఈవో రోమేష్ సోబ్టి తెలిపారు. మొత్తంమీద గత త్రైమాసికంలో మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.607 కోట్ల నిధులను కేటాయించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో కేటాయించిన రూ.237 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. తొలి త్రైమాసికంలో రూ.590 కోట్లు కేటాయించింది.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.3 వేల కోట్లు రుణంగా అందించగా, తన అనుబంధ సంస్థలకు రూ.2 వేల కోట్లను ఇచ్చింది. వీటికోసం తాకట్టుకింద పలు ఆస్తులు ఉన్నప్పటికీ ఇందుకోసం రెండు నెలలు వేచి చూడాల్సి ఉంటుందని తెలిపారు. సమీక్షకాలంలో ఆదాయం రూ.5,473.54 కోట్ల నుంచి రూ.7,232.32 కోట్లకు ఎగబాకినట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. గడిచిన త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.16 శాతం నుంచి 1.13 శాతానికి తగ్గినట్లు వెల్లడించిన బ్యాంక్..నికర ఎన్‌పీఏ 0.59 శాతంగా ఉన్నది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.2,288 కోట్లకు చేరుకోగా, ఇతర ఆదాయ వసూళ్లలో 24 శాతం పెరుగుదల కనిపించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపగా, మళ్లీ కేరళలో వచ్చిన వరదలు కూడా అంతే స్థాయిలో ప్రభావం చూపయన్నారు. ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో బ్యాంక్ షేరు ధర 1.5 శాతం పెరిగి రూ.1,600.80 వద్ద ముగిసింది.

295
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles