రుణాలు కారు చౌక!

Sat,October 5, 2019 01:36 AM

-మరో పావుశాతం వడ్డీరేట్లను తగ్గించిన రిజర్వు బ్యాంక్
-5.15 శాతానికి తగ్గిన రెపోరేటు, 4.90 శాతంగా రివర్స్ రెపో
-తొమ్మిది నెలల్లో వడ్డీరేట్లు తగ్గడం ఇది ఐదోసారి..
-మున్ముందు మరింత తగ్గిస్తామన్న ఆర్బీఐ గవర్నర్ దాస్

ముంబై, అక్టోబర్ 4:గృహ, వాహన రుణాలు మరింత చౌకకు లభించనున్నాయి. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను మరోమారు పావు శాతం తగ్గించింది. ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిని ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు సెంట్రల్ బ్యాంక్ తనవంతుగా ప్రస్తుత పండుగ సీజన్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ ఏడాది వడ్డీరేట్లను తగ్గించడం ఇది ఐదోసారి కావడం విశేషం. సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపోరేటు పావుశాతం తగ్గడంతో 5.15 శాతానికి తగ్గింది. వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవడానికి రిజర్వు బ్యాంక్ గవర్నర్ అధ్యక్షతన ఏర్పాటైన ఆరుగురు సభ్యులు కలిగిన ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ)లోని అందరు సభ్యులు రేట్లను తగ్గించడానికి ఓటువేశారు. ఐదుగురు సభ్యులు పావుశాతం తగ్గించడానికి ఒకే చెప్పగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు. దీంతో రుణ రేటు ఇంచుమించు పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మార్చి 2010లో 5 శాతంగా ఉన్న రెపోరేటు..మళ్లీ ఇంతటి స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. రెపో రేటుతోపాటు రివర్స్ రెపోరేటు అంతేస్థాయిలో తగ్గించడంతో 4.90 శాతంగా నమోదైంది. బ్యాంక్ బేస్‌రేటును 5.40 శాతంగా నిర్ణయించింది. ఆర్థిక మందగమ నం, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం, వృద్ధిరేటు తిరిగి పుంజుకునే వరకు ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చుని దాస్ సంకేతాలిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు వడ్డీరేట్లను 110 బేసిస్ పాయింట్లను తగ్గించినట్లు అయింది.

బ్యాంకులు తగ్గించింది కొసరంతే..

పడిపోతున్న వృద్ధిరేటును పునరుత్తేజం ఇవ్వడానికి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను ఐదుసార్లు తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని మాత్రం బ్యాంకులు ఖాతాదారులుకు చేరవేయడం లేదు. ఫిబ్రవరి 7 నుంచి అక్టోబర్ 4 వరకు సెంట్రల్ బ్యాంక్ ఐదుసార్లు 110 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను తగ్గిస్తే..బ్యాంకులు కేవలం 29 బేసిస్ పాయింట్లు తగ్గించి చేతులు దులుపుకున్నాయి. మరోవైపు, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి తోడు, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు పాలసీ నిర్ణయాలపై ప్రభావం చూపాయి. కార్పొరేట్ ట్యాక్స్‌ను పది శాతం తగ్గించడంతో ద్రవ్యలోటుపై ప్రభావం పడేదానిపై దాస్ స్పందిస్తూ..లోటును కట్టడి చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమవుతున్నదని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ప్రైవేట్ వినిమయం, పెట్టుబడులు పెరుగడానికి దోహదం చేయనున్నదన్నారు. రెండో త్రైమాసికంలో 3.4 శాతంగా ద్రవ్యోల్బణం అంచనావేస్తున్న సెంట్రల్ బ్యాంక్..ఈ ఏడాది మొత్తానికి 4 శాతం మించే అవకాశాలు లేవని పేర్కొంది.

డివిడెండ్‌పై సమాచారం లేదు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మరో రూ.30 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ చెల్లించాలనేదానిపై సమాచారం లేదని శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఖజానాపై పడుతున్న భారాన్ని పూడ్చుకోవడానికి కేంద్రం ఆర్బీఐ డివిడెండ్‌పై ఆధారపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. ఈ డివిడెండ్ విషయంపై మీడియాలో వార్తలు చూశాను..కేంద్రం నుంచి అలాంటి డిమాండేమి తమ వద్దకు రాలేదన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంక్ రూ.10 వేల కోట్లను మధ్యంతర డివిడెండ్ కింద కేంద్రానికి చెల్లించింది. గత నెలలో ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో రూ.1,76,051 కోట్ల నిధులను కేంద్రానికి బదిలీ చేయడానికి ఆర్బీఐ బోర్డు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

ఎంఎఫ్‌ఐఎస్‌ల రుణ పరిమితి రూ.1.25 లక్షలకు

మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూట్‌లకు రిజర్వుబ్యాంక్ భారీ ఊరటనిచ్చింది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రుణ పరిధిని లక్ష రూపాయల నుంచి రూ.1.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. గృహస్తుల ఆదాయం పెరిగిన నేపథ్యంలో వారు తిరిగి రుణాలు చెల్లించే స్థోమత కలిగివుండటం వల్లనే ఈ పరిమితి పెంచింది. సూక్ష్మ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్(ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐఎస్)లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయలు, అర్బన్/సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1.60 లక్షలుగా ఉండేది. 2015 తర్వాత ఈ పరిమితిని పెంచడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది వృద్ధి 6.1 శాతమే

భారత వృద్ధి అంచనాల్లో మరోమారు కోత విధించింది రిజర్వు బ్యాంక్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో 6.9 శాతంగా ఉంటుందని అంచనావేసిన ఆర్బీఐ..ఈసారి దీనిని 6.1 శాతానికి కుదించింది. అయినప్పటికీ ఈ ఏడాది రెండో అర్థభాగం(అక్టోబర్ నుంచి మార్చి వరకు) కోలుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో వృద్ధి ఆరేండ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ అంచనాల్లో కోత విధించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. వినిమయం పాతాళానికి పడిపోవడం, ప్రైవేట్ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉండటం వృద్ధి దిగవకు పడిపోతున్నది. మందగమన పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి కేంద్ర ప్రభుత్వం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్స్‌ను 10 శాతం వరకు తగ్గించడం, పలు బ్యాంకులను విలీనం చేయడం, రియల్ ఎస్టేట్ రంగానికి రూ.70 వేల కోట్ల ప్యాకేజీ వంటివి ఉన్నాయి. కేంద్రం తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాలతో భవిష్యత్తులో వృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉన్నదని పరపతి సమీక్ష అభిప్రాయపడింది. 2020-21లో భారత్ మళ్లీ 7 శాతం వృద్ధిని సాధించనున్నదని పేర్కొంది.

ఎవరేమన్నారు..

గతేడాదిగా 135 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు కేంద్రం తీసుకుంటున్న కీలక చర్యలతో ఈ మాత్రమైన వృద్ధిని సాధించింది. భవిష్యత్తులో వృద్ధిరేటు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
- చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
రెపోరేటు తగ్గించడంతో రుణాలకు డిమాండ్ పెరుగనున్నది. వచ్చే త్రైమాసికాల్లో వృద్ధి పరుగులు పెట్టే ఆస్కారం ఉన్నది.
- డీకే అగర్వాల్, పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్
ముందస్తు అంచనావేసినట్లుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో కోత విధించింది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల్లో భాగంగా కార్పొరేట్ ట్యా క్స్ తగ్గించడం వృద్ధికి ఊతమివ్వనున్నది.
- అన్షుమన్ మ్యాగజైన్, సీబీఆర్‌ఈ చైర్మన్
తక్కువ వడ్డీకే రుణాలు లభించనుండటంతో ప్రస్తుత పండుగ సీజన్‌లో వాహనాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నది. ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు మొత్తంగా వినియోగదారులు బదిలీ చేయాల్సిన అవసరం ఉన్నది.
- రాజన్ వాధేరా, సియామ్ ప్రెసిడెంట్

పరపతి సమీక్షలో ముఖ్య అంశాలు..

-స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణరేటు 5.15 శాతానికి తగ్గింది
-2019 సంవత్సరంలో వడ్డీరేట్లు తగ్గించడం ఇది ఐదోసారి.
-ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గింపు
-కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో ప్రైవేట్ వినిమయం, పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం.
-ఈ ఏడాది రెండో అర్థభాగంలో ద్రవ్యోల్బణం 3.5-3.7 శాతం మధ్యలో.
-అక్టోబర్ 1 నాటికి విదేశీ మారకం నిల్వలు 434.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మార్చితో పోలిస్తే 21.7 బిలియన్ డాలర్లు అధికం
-ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ)లోని అందరు సభ్యులు వడ్డీరేట్లను తగ్గించడానికి మొగ్గుచూపారు.
-డిసెంబర్ 3-5 మధ్యకాలంలో తదపరి పరపతి సమీక్ష

673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles