ప్రధానికి అప్పుడే నివేదన

Wed,September 12, 2018 12:34 AM

Raghuram Rajan gave PMO list of high profile banking fraud cases

-అయినా చర్యలు తీసుకున్నట్లు లేదు
-బడా మోసాల జాబితాపై రాజన్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం ఏ స్థాయిలో ఉందన్నది కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుత బ్యాంకింగ్ రంగ దుస్థితికి.. ఆ మాటకొస్తే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికే రాజన్ కారణమన్న విమర్శలు ప్రభుత్వ అధీకృత అధిపతుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీకి అందించిన తన నివేదికలో ప్రభుత్వ పెద్దల జోక్యాన్ని తేటతెల్లం చేశారు. బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని ఈ కమిటీ ముందుంచిన ఆ నివేదికలో నేను గవర్నర్‌గా ఉన్నప్పుడు ఓ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్‌ను ఆర్బీఐ ఏర్పాటు చేసింది. దర్యాప్తు సంస్థలకు మోసాల గురించిన సమాచారాన్ని ముందుగానే తెలిపేలా ఇది ఏర్పాటైంది. నేను కూడా ప్రధాన మంత్రి కార్యాలయాని (పీఎంవో)కి ఓ హై-ప్రొఫైల్ ఫ్రాడ్ లిస్టును పంపించాను. కనీసం ఒకరిద్దరిపైనైనా కేసు పెట్టి అరెస్టు చేయాలని కోరాను.

కానీ అలా జరిగినట్లు లేదు. దానివల్ల మోసాలు మరింత పెచ్చుమీరాయి అని రాజన్ పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా చెప్పుకుంటున్న పీఎన్‌బీ-నీరవ్, చోక్సీల రూ.14,000 కోట్ల స్కాంలో బ్యాంకర్లు నిద్రపోయారని, మోసాన్ని ఆదిలోనే గుర్తిస్తే నష్టం ఇంత తీవ్రంగా ఉండేది కాదని సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలు చెబుతున్న క్రమంలో రాజన్ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇక రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్ణయమే అంతిమం కాదంటూ పరోక్షంగా ప్రభుత్వ జోక్యాన్ని ఎండగట్టారు. ఇదిలావుంటే 2006-2008 వ్యవధిలో వృద్ధిరేటు బలంగా ఉందని, విద్యుత్ తదితర మౌలిక ప్రాజెక్టులన్నీ అంచనా వ్యయం ప్రకారం సకాలంలో పూర్తయ్యాయన్న రాజన్.. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు మారిపోయాయన్నారు.

అయినప్పటికీ బ్యాంకులు దీన్ని గుర్తించకుండా గత జీడీపీని దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌సహా అన్ని మౌలిక రంగ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చుకుంటూపోయాయని, ఇప్పుడు మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ల్లో అవే అగ్రస్థానంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఇక బ్యాంకింగ్ రంగంలో మోసాలు కూడా బాగా పెరిగిపోయాయని, అయితే మొత్తం ఎన్‌పీఏలతో పోల్చితే మాత్రం వీటి సంఖ్య తక్కువగానే ఉందన్నారు. స్థూలంగా బ్యాంకర్ల వైఫల్యం, నెమ్మదించిన కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలే నిరర్థక ఆస్తులకు కారణమన్నారు. మొత్తానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనాపరమైన వ్యవహారాలు మెరుగవ్వాలంటూ తన ఈ నివేదికలో సూచించిన రాజన్.. రుణాలు, ఇతరత్రా అంశాల్లో ప్రభుత్వ పెద్దల జోక్యం కూడా తగ్గాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

2071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS