పీఎన్‌బీకి స్కామంత నష్టం!


Wed,May 16, 2018 12:34 AM

-క్యూ4లో రూ.13,417 కోట్లుగా నమోదు..
-బ్యాంక్ నికర విలువ కంటే మొండి బకాయిలే ఎక్కువ

PNB
న్యూఢిల్లీ, మే 15: దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న నీరవ్ మోదీ కుంభకోణం బ్యాంక్‌ను పాతాళంలోకి నెట్టేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.13,416.91 కోట్ల నష్టం వాటిళ్లిందంటే అది నీరవ్ మోదీ చలవే. అంటే బ్యాంకుకు ఆయన చేసిన మోసం స్థాయిలోనే నష్టాలను ప్రకటించింది అన్నమాట. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి నష్టాలను నమోదు చేసుకోవడం కూడా ఇదే తొలిసారి. నీరవ్ మోదీ మోసం, మరోవైపు మొండి బకాయిలు పెరుగడం బ్యాంక్ పనితీరుపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి మాత్రం బ్యాంక్ రూ.261.90 కోట్ల లాభాన్ని గడించింది. ఆర్థిక ఫలితాల సందర్భంగా జరిగిన బోర్డు సమావేశానికి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హాజరుకాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆదాయం విషయానికి వస్తే రూ.14,989.33 కోట్ల నుంచి రూ.12,945.68 కోట్లకు పడిపోయింది. సమీక్షకాలంలో బ్యాంకు మొండి బకాయిలు అమాంతం పెరిగాయి. జనవరి-మార్చి మధ్యకాలంలో బ్యాంక్ అడ్వాన్స్‌లో ఇది 18.38 శాతానికి ఎగబాకింది. ఏడాదిక్రితం ఇది 12.53 శాతంగా ఉంది.

అలాగే నికర ఎన్‌పీఏ కూడా 7.81 శాతం నుంచి 11.24 శాతానికి చేరుకున్నట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. విలువ పరంగా చూస్తే బ్యాంక్ నిరర్థక ఆస్తులు రూ.55,370 కోట్ల నుంచి రూ.86,620 కోట్లకు, నికర ఎన్‌పీఏ రూ.32,702 కోట్ల నుంచి రూ.48,684 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ ప్రకటించింది. అయితే బ్యాంక్ నికర విలువ మాత్రం దాదాపు రూ.41 వేల కోట్లుగానే ఉండటం గమ నార్హం. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.16,202.82 కోట్ల స్థాయిలో నిధులను కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో కేటాయించిన రూ.4,910.39 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ ప్రకటించిన రూ.1,324.8 కోట్ల నికర లాభానికి మరో రూ.532.6 కోట్లు కలిపింది. గడిచిన త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ కింద రూ.5,473 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో బ్యాంకులో కేంద్రం వాటా 57.04 శాతం నుంచి 62.25 శాతానికి చేరుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.56,876.63 కోట్ల ఆదాయంపై రూ.12,282.82 కోట్ల నష్టాన్ని చవిచూసింది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో బ్యాంక్ షేరు ధర భారీగా పడిపోయింది. ఇంట్రాడేలో ఆరు శాతానికి పైగా నష్టపోయిన షేరు ధర చివరకు 3.80 శాతం నష్టంతో రూ.86 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ.938.07 కోట్లు తగ్గి రూ.23,740.93 కోట్లకు పడిపోయింది.

నీరవ్ పాట రూ.14,357 కోట్లు

నీరవ్ మోదీ గ్యాంగ్ మోసం వలన తమకు జరిగిన నష్టం మరింత పెరిగి దాదాపు రూ.14,357 కోట్లకు చేరినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వెల్లడించింది. నీరవ్, ఆయన అనుచరులు ముంబైలోని బ్రాడీ హౌస్ పీఎన్‌బీ శాఖలోని కొందరు ఉద్యోగులతో కుమ్మక్కై తప్పుడు అండర్‌టేకింగ్ లెటర్లు (ఎల్‌వోయూలు), ఫారిన్ క్రెడిట్ లెటర్ల (ఎఫ్‌ఎల్‌సీల) సాయంతో చేసిన ఈ భారీ కుంభకోణం ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంపై ప్రస్తుతం వేర్వేరు సంస్థలు విస్తృతంగా దర్యాప్తు జరుపుతున్నాయి. వీటిలో ఒకటైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ కుంభకోంణంలో నీరవ్, ఆయన సోదరుడు నిశాల్ మోదీతో పాటు నీరవ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సుభాష్ పరబ్‌ల పాత్రను వివరిస్తూ సోమవారం తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. కాగా, తప్పుడు ఎల్‌వోయూలు, ఎఫ్‌ఎల్‌సీల సాయంతో నీరవ్, ఆయన మామ మెహుల్ చోక్సీ ఆధ్వర్యంలోని సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.6,586.11 కోట్ల రుణాల కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిందని, దీంతో ఆయా బ్యాంకులకు అప్పులను తామే చెల్లించామని పీఎన్‌బీ పేర్కొన్నది. మార్చి 31 తర్వాత ఈ అప్పులు రూ.6,959.79 కోట్లకు పెరిగాయని, వీటితో పాటు నీరవ్, చోక్సీ సంస్థలు తీసుకున్న ఇతర రుణాలను కూడా కలుపుకుంటే ఈ కుంభకోణం వలన జరిగిన మొత్తం నష్టం రూ.14,356.84 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ వివరించింది.

528

More News

VIRAL NEWS