రూ.2.5 లక్షల కోట్లు

Fri,November 22, 2019 12:28 AM

అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన రుణాలు
న్యూఢిల్లీ, నవంబర్ 21: ఈ ఏడాది పండుగ సీజన్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రుణాలు ఇచ్చాయి. ఒక అక్టోబర్ నెలలోనే ఏకంగా రూ.2.52 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో రూ.1.05 లక్షల కోట్లు తాజా రుణాలని పేర్కొంది. వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.46,800 కోట్ల నిధులను మంజూరు చేశాయి బ్యాంకులు. వినిమయాన్ని పెంచడానికి, పడిపోతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలు మంజూరు చేయాలని సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదేశించారు. దీంతో దేశవ్యాప్తంగా 374 జిల్లాలో బ్యాంకులు రుణమేళాను గత నెలలో నిర్వహించాయి. గత నెల లో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.2,52, 589 కోట్ల రుణాలు ఇవ్వగా, వీటిలో నూతనంగా జారీ చేసినవి రూ.1,05,599 కోట్లు. అలాగే రూ.46,800 కోట్ల నూతన వర్కింగ్ క్యాపిటల్ కింద జారీ చేశాయి బ్యాంకులు.


ఈ మొత్తం రుణాల్లో 60 శాతం కొత్తగా ఇచ్చినవి కావడం విశేషం. గత కొన్నేండ్లుగా నిధులు లేక సతమతమైన ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి పుంజుకున్నాయని, పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగాయని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. గడిచిన రెండేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే గత నెలలో నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు కూడా రూ.19,627.26 కోట్ల మేర రుణాలు ఇచ్చాయి. తొలి విడుత అక్టోబర్ 1-9 వరకు 226 జిల్లాల్లో ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కూడా రుణ మేళాలను నిర్వహించగా, రెండో విడుత అదే నెల 21 నుంచి 25 వరకు మేళాలను నిర్వహించాయి. వీటిలో ప్రభుత్వరంగ సంస్థలు తమ ఖాతాదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోగా, ప్రైవేట్, ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం వెనుకంజ వేశాయి. ఈ నివేదిక ప్రకారం రూ.1.22 లక్షల కోట్ల మేర కార్పొరేట్ రుణాలు ఇచ్చిన బ్యాంకులు.. రూ. 40,504 కోట్ల మేర వ్యవసాయ రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు రూ.37,210 కోట్లు, గృహ రుణాలు రూ.12,166 కోట్లు, వాహన రుణాలు రూ.7,058 కోట్ల మేర ఇచ్చాయి.

263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles