రూ.60 కోట్ల నగలు.. ఎయిర్‌క్రాఫ్ట్

Mon,October 7, 2019 12:19 AM

పీఎంసీ బ్యాంక్ కేసులో కొనసాగుతున్న హెచ్‌డీఐఎల్ ప్రమోటర్ల ఆస్తుల జప్తు
ముంబై, అక్టోబర్ 6: పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు దూకుడు మీదున్నాయి. ఓవైపు నిందితుల అరెస్టులు, మరోవైపు ఆస్తుల జప్తులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు చెందిన స్థిరచరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సీజ్ చేస్తున్నారు. తాజాగా సారంగ్ వాధవాన్‌కు చెందిన ఓ 9 సీటర్ బంబార్డియర్ చాలెంజర్-300 ఎయిర్‌క్రాఫ్ట్‌తోపాటు రూ.60 కోట్ల విలువైన నగలను ఈడీ స్వాధీనం చేసుకున్నది. ఇందులో రూ.15 కోట్ల విలువైన ఉంగరం ఉండటం గమనార్హం.


ఇక ఈ ప్రైవేట్ విమానం.. ప్రివిలేజ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నమోదై ఉన్నది. ఈ సంస్థకు సారంగ్ ఆయన తండ్రి రాకేశ్ వాధవాన్లే డైరెక్టర్లుగా ఉన్నారు. మరోవైపు నగలను జప్తు చేయకుండా ఉండేందుకు సారంగ్ వాధవాన్ భార్య అను సమీప బంధువు వద్దకు వాటిని తరలించారు. అయినప్పటికీ సదరు వ్యక్తిని చట్టపరంగా హెచ్చరించి ఈడీ అధికారులు నగలను తీసుకున్నారు. కాగా, మాల్దీవుల్లో సారంగ్ వాధవాన్‌కు చెందిన ఓ విలాసవంతమైన తెరచాప నావ కూడా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో దాన్నీ సీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 12 లగ్జరీ కార్లను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. పీఎంసీ బ్యాంక్ నుంచి హెచ్‌డీఐఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు మొత్తం 44 రుణాలు తీసుకున్నాయి. గత నెల 19 నాటికి వీటి విలువ రూ.6,500 కోట్లుగా ఉన్నది. బ్యాంక్ మొత్తం రుణాల్లో (రూ.8,880 కోట్లు) ఇది దాదాపు 73 శాతానికి సమానం.

593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles