ఇండ్ల కొనుగోలుదారులకు లబ్ధి?


Fri,January 12, 2018 12:55 AM

ఆదాయ పన్ను ప్రయోజనాల కోసం ఫ్లాట్ బయ్యర్ల సంఘం డిమాండ్
budget-arun-jaitley
న్యూఢిల్లీ, జనవరి 11: గడువులోగా ఇండ్లను బిల్డర్లు అప్పగించకపోవడంతో ఆదాయ పన్ను ప్రయోజనాలను కొనుగోలుదారులు కోల్పోవాల్సి వస్తుండగా, దీనికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేయాలని నేషనల్ ఫ్లాట్ బయ్యర్ల సంఘం డిమాండ్ చేస్తున్నది. బిల్డర్ల పొరబాట్ల కారణంగానే ఇండ్ల స్వాధీనం ఆలస్యమవుతున్నదని, అయినప్పటికీ ఏ తప్పూ చేయని కొనుగోలుదారులు మాత్రం గృహ రుణాలపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి రాబోయే బడ్జెట్‌లో గృహ కొనుగోలుదారులకు మేలు జరిగేలా ఆదాయ పన్ను ప్రయోజనాల నిబంధనలను సరళతరం చేయాలని కోరింది.

భారీ సంస్కరణలుండకపోవచ్చు

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఈ ఫిబ్రవరి 1న ప్రకటించే 2018-19 వార్షిక బడ్జెట్‌లో భారీ సంస్కరణలకు చోటుండకపోవచ్చన్న అభిప్రాయాన్ని సుందరం మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ సీఐవో ఎస్ కృష్ణకుమార్ వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు సంబంధించిన పథకాలకు పెద్ద మొత్తంలో కేటాయింపులు ఉండవచ్చన్న ఆయన ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల జోలికి మోదీ సర్కారు పోకపోవచ్చన్నారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేయడమే దీనికి కారణమన్నారు.

జైట్లీపై కార్పొరేట్ ఒత్తిడి

వచ్చే నెల బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో అరుణ్ జైట్లీపై కార్పొరేట్ పన్ను రేటు కోత హామీ ఒత్తిడి కనిపిస్తున్నది. 2015-16 బడ్జెట్‌లో వచ్చే నాలుగేండ్లలో కార్పొరేట్ పన్ను రేటు 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుందని ప్రకటించారు. అయితే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నెలనెలా తగ్గిపోతుండటంతో ద్రవ్యలోటు భయాలు కేంద్రాన్ని వెంటాడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో 3.2 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. పడిపోతున్న ఆదాయం, పెరుగుతున్న వ్యయం దృష్ట్యా ఈ లక్ష్యం నెరవేరే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వానికి ఈ దఫా ఆఖరి పూర్తికాల బడ్జెట్ అయిన రాబోయే బడ్జెట్‌లో కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించి ఆదాయాన్ని మరింతగా జైట్లీ దిగజారుస్తారా? అన్నది అనుమానంగానే మారింది. ఈ క్రమంలో కనీసం 28 శాతానికైనా తగ్గించాలని ఫిక్కీసహా ఇతర కార్పొరేట్ వర్గాలు కోరుతున్నాయి.

718

More News

VIRAL NEWS