ఉషాకు చెక్


Wed,May 16, 2018 12:32 AM

-అన్ని అధికారాలు దూరం
-అలహాబాద్ బ్యాంక్ నిర్ణయం

usha
ముంబై, మే 15: ఉషా అనంతసుబ్రమణియన్ అధికారాలకు అలహాబాద్ బ్యాంక్ చెక్ పెట్టింది. మంగళవారం సమావేశమైన బ్యాంక్ బోర్డు.. ఉషాకున్న అన్ని అధికారాలను తక్షణమే వెనుకకు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో ఉషా పేరును సోమవారం సీబీఐ తమ చార్జిషీటులో పేర్కొన్న విషయం తెలిసిందే. గతేడాది మే వరకు పీఎన్‌బీ సీఎండీగా ఉషా పనిచేశారు. చార్జిషీటు నేపథ్యంలో ఉషాపై, ఇద్దరు పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆయా బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలోనే సమావేశమైన అలహాబాద్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉషా అధికారాలపై వేటు వేశారు. ఇప్పటికే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను పీఎన్‌బీ తమ బోర్డు నుంచి బయటకు పంపించేసింది. ఈరోజు జరిగిన మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఎండీ, సీఈవోగా ఉషాకున్న అన్ని అధికారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు అని ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్ బ్యాంక్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. బ్యాంక్ అంతర్గత పరిపాలన, ఇతరత్రా కార్యకలాపాల నిర్వహణ సజావుగా సాగేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని కూడా ఈ సందర్భంగా సదరు ప్రకటనలో బ్యాంక్ వివరించింది. దాదాపు రూ.14,400 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో సీబీఐ తొలి చార్జిషీటును దాఖలు చేయగా, ఇందులో ఉషాతోపాటు స్కాం ప్రధాన సూత్రధారి, వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ, అతని సోదరుడు నిషాల్ మోదీ, నీరవ్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న సుభాష్ పరబ్ తదితరుల పేర్లను చేర్చింది.

880
Tags

More News

VIRAL NEWS