వారికి అంతా తెలుసు..


Wed,May 16, 2018 12:29 AM

CBI
నీరవ్ మోదీ మోసంలో పీఎన్‌బీ ఉన్నతాధికారుల పాత్రపై సీబీఐ
న్యూఢిల్లీ, మే 15: నీరవ్ మోదీ కుంభకోణంతో కుదేలైన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఇప్పుడు తమ ఉన్నతాధికారులపై వస్తున్న అభియోగాలు మరింత తలనొప్పిని తీసుకొస్తున్నాయి. తప్పుడు అండర్‌టేకింగ్ లెటర్ల (ఎల్‌వోయూల) సాయంతో జరిగిన ఈ కుంభకోణంపై పీఎన్‌బీ వాస్తవ పరిస్థితులను వివరించకుండా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను తప్పుదారి పట్టించిందని, ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీహౌస్ శాఖ నీరవ్‌తో పాటు ఆయన మామ మెహుల్ చోక్సీ ఆధ్వర్యంలోని సంస్థలకు వేలాది కోట్ల రుణాలను అక్రమంగా మంజూరుచేసి రిజర్వు బ్యాంకు హెచ్చరికలను బేఖాతరుచేసిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిందించింది. అప్పట్లో పీఎన్‌బీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా పనిచేసిన ఉషా అనంతసుబ్రమణియన్‌తో పాటు ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు ఈ కుంభకోణం గురించి తెలిసినప్పటికీ ఈ మోసాన్ని నిరోధించడంలో వారు విఫలమయ్యారని సోమవారం దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. 2016లో అనంతసుబ్రమణియన్ పీఎన్‌బీ చీఫ్‌గా పనిచేస్తున్నప్పుడు ఇదేవిధమైన మోసం గురించి చండీగఢ్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) ఫిర్యాదు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. అప్పటి ఐఓబీ కేసు, ఇప్పటి పీఎన్‌బీ కేసు స్వభావం, వాటి తీరుతెన్నులు ఒకే విధంగా ఉన్నాయని, దీనిని బట్టి చూస్తుంటే ఎల్‌వోయూల సాయంతో మోసగాళ్లు బ్యాంకులను ముంచుతున్న పద్ధతుల గురించి పీఎన్‌బీ ఉన్నతాధికారులకు పూర్తిగా తెలుసని స్పష్టమవుతున్నదని సీబీఐ అధికారులు అంటున్నారు. ఐఓబీలో జరిగిన మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాంకుల్లో ఇటువంటి మోసాలు జరుగకుండా నిరోధించేందుకు రిజర్వు బ్యాంకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని, అయితే పీఎన్‌బీలో ఎక్కడా ఈ మార్గదర్శకాలను పాటించిన దాఖలాలు కనిపించడం లేదని వారు తెలిపారు. ఎల్‌వోసీలకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ అనంతసుబ్రమణియన్, పీఎన్‌బీలోని మరో ముగ్గురు ఉన్నతాధికారులు (బ్రహ్మాజీరావు. శరణ్, అహద్) మాత్రమే పరిశీలించి క్లియర్ చేసేవారని, దీనిని బట్టి చూస్తే.. ఇటువంటి మోసాలకు పాల్పడటం ఎలాగన్నదీ వారికి కచ్చితంగా తెలుసని స్పష్టమవుతున్నదని సీబీఐ తన అభియోగపత్రంలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

589
Tags

More News

VIRAL NEWS