మదుపరి జేబుకు చిల్లు పెట్టేయోచనలో నీరవ్!


Sun,February 18, 2018 12:50 AM

nirav-modi
ప్రభుత్వరంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఏకంగా సామాన్యుడి జేబు కు చిల్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుత సంవత్సరంలో తనకు చెందిన కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తున్నది. నీరవ్ మోదీ, ఆయన మామయ్య గీతాంజలి జువెల్లరీ సీఎండీ మెహుల్ చోక్సీలు కలిసి దలాల్ స్ట్రీట్‌లోకి ప్రవేశించి భారీ స్థాయిలో నిధులను సేకరించాలనుకున్నారట. వీటిలో మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్స్ ఉన్నట్లు ప్రముఖ బ్యాంకర్ వెల్లడించారు. ఐపీవోకి రావడానికి గత నవంబర్‌లోనే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతించింది కూడా. గడిచిన ఐదేండ్లలో గీతాంజలి నికర లాభం రూ.166 కోట్ల నుంచి రూ.595 కోట్లకు పెరుగగా, ఇదే సమయంలో అప్పు రూ.5,239 కోట్ల స్థాయి నుంచి రూ.8,254 కోట్లకు చేరుకున్నది.

ఇదే సమయంలో రూ.12,511 కోట్ల అమ్మకాలపై రూ.455 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీకి రూ.3,509 కోట్ల రుణం ఉన్నది. 2013లో స్టాక్ మార్కెట్లో లిైస్టెన గీతాంజలికి సంబంధించిన షేర్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు సెబీ గుర్తించింది. దీంతో చోక్సీని మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా నిషేధం విధించింది. మార్చి 2009 నుంచి ఏప్రిల్ 2013 మధ్యకాలంలో గీతాంజలి షేరు ధర 1900 శాతం పెరిగింది. రూ.32.50గా ఉన్న షేరు ధర ఏకంగా రూ.649.70కి చేరుకున్నది. సెబీ నిషేధం విధించడంతో కంపెనీ షేరు 90 శాతం తగ్గి రూ.65.42 వద్దకు జారుకున్నది.

మూతపడ్డ గీతాంజలి స్టోర్లు

దేశవ్యాప్తంగా ఉన్న గీతాంజలి జువెల్లరీ షోరూంలు వరుసగా మూడోరోజు మూతపడ్డాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పీఎన్‌బీలో జరిగిన రూ.11,400 కోట్ల స్కాంలో కీలక సూత్రదారి నీరవ్ మోదీకి మామయ్య అయిన మెహుల్ చోక్సీకి చెందినవే ఈ ఆభరణాల షోరూంలు. ఆయనకు సంబంధించిన అన్ని షోరూంలలో ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

410

More News

VIRAL NEWS