రోడ్డునపడనున్న 900 మంది కార్మికులు

Sun,February 18, 2018 01:04 AM

PNB fraud case ED wants Nirav Modi, Mehul Choksi passports revoked

-మహేశ్వరం యూనిట్‌పై స్కాం ప్రభావం
MHRM
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లోనూ నీరవ్ మోదీకి సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న వజ్రాల కంపెనీలపై దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల పరిధిలో ఉన్న హార్డ్‌వేర్ పార్క్‌లో నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ అండ్ జువెల్లరీ కంపెనీలను ఈ కుంభకోణం ప్రభావితం చేస్తున్నది. ఇది మూతబడితే ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 900 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. వీరిలో 110 మంది వికలాంగ కార్మికులే ఉండడం మరింత బాధాకరం. మెహుల్ చోక్సీ.. హైదరాబాద్ జెమ్స్ లిమిటెడ్ పేరిట మొత్తం ఐదు కంపెనీలను ఈ సెజ్‌లో నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి రత్నాలు, వజ్రాలను దిగుమతి చేసుకుని ఈ సెజ్‌లో ప్రాసెసింగ్ చేస్తున్నారు.

ఇక్కడ నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కార్మికులు పనిచేస్తుండగా, వీరిలో కొందరు సమీపంలోని తుక్కుగూడలో ఇండ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మరికొందరు సెజ్‌లోనే కంపెనీకి చెందిన వసతి గృహాల్లో ఉండి పనిచేస్తున్నారు. నెలకు రూ.7 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్టు సమాచారం. అయితే పీఎన్‌బీ రూ.11,400 కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీ వ్యాపార సంస్థలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా ఈడీ అధికారులు గురు, శుక్రవారాల్లో మహేశ్వరం యూనిట్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈ కంపెనీలను మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఇందులో పనిచేస్తున్న 900 మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమైంది. వారంతా కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే ఎవరిపై వారు ఆందోళన చేయాలో తెలియని అయోమయంలో కార్మికులు ఉన్నారు.

హైదరాబాద్‌లో నీరవ్ సామ్రాజ్యంపై కొనసాగుతున్న ఆరా...

పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా పలు బ్యాంకులను రూ. వేల కోట్లలో మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. దేశవ్యాప్తంగా విస్తరించిన వ్యాపారంలో హైదరాబాద్ కూడా కీలక భాగంగా ఉండడంతో ఈడీ అధికారులు ఇక్కడి కంపెనీలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మహేశ్వరం యూనిట్‌తోపాటు గీతాంజలి జెమ్స్ అండ్ జువెలర్స్, మరో ఐదు కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ స్వాధీనం చేసుకున్న మెటీరియల్ వాస్తవ విలువ రూ.300 కోట్లు అవగా, దర్యాప్తు అధికారులకు లభించిన ఫైళ్లలో వాటి విలువ రూ.3,500 కోట్లకుపైగా చూపినట్టు తెలిసింది. ఇక ఈ సోదాల్లో పలు రికార్డులనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

1264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles