ఎందుకు గుర్తించలేదు?

Tue,February 20, 2018 02:02 AM

PNB Finance Ministry Has First Comment Reportedly Says RBI Failure

RBI
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణాన్ని ముందుగానే ఎందుకు కనిపెట్టలేకపోయారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిలదీసింది. ఈ మేరకు ఆర్బీఐకి రాసిన ఓ లేఖలో సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షణా లోపాలపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఆర్బీఐ ఎప్పటికప్పుడు బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లను, నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ లేదా మొండి బకాయిలు)ను, ఇతరత్రా లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా.. ఇంత పెద్ద కుంభకోణం ఎలా బయటకు రాకుండాపోయింది అంటూ ప్రశ్నించింది. దీనివల్ల మరింత కట్టుదిట్టమైన, ప్రభావవంతమైన తనిఖీ వ్యవస్థ అవసరం ఉందని తేలిపోయింది అని లేఖలో ఆర్థిక సేవల శాఖ అభిప్రాయపడింది. రూ.11,400 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

293 లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ లేదా అండర్‌స్టాండింగ్స్ (ఎల్‌వోయూ), మరో 224 ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్‌ఎల్‌సీ)లు మోసపూరితంగా జారీ అయినట్లు పీఎన్‌బీ చెబుతుండగా, వీటి ద్వారానే ఇతర భారతీయ బ్యాంకులకు చెందిన విదేశీ శాఖల నుంచి నీరవ్ మోదీ సంస్థలు వేల కోట్ల రుణాలను అందుకున్నాయి. 2011లోనే ఈ కుంభకోణానికి బీజం పడగా, ఇన్నేండ్లపాటు ఈ వ్యవహారాన్ని అటు బ్యాంక్, ఇటు ఆర్బీఐ గుర్తించకపోవడంపట్ల కేంద్రం పెదవివిరుస్తున్నది. కాగా, ఈ మోసాన్ని కనిపెట్టడంలో ఆడిటర్ల వైఫల్యంపై సమీక్షించాలని ఆర్బీఐని ఆర్థిక శాఖ కోరింది. అంతేగాక ఇలాంటి మోసాలు మరోసారి జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి సారించాలని ఆర్బీఐకి కేంద్రం సూచించినట్లు సమాచారం.

రంగంలోకి సెంట్రల్ విజిలెన్స్

పీఎన్‌బీ కుంభకోణంలో సంబంధాలపై ఆరా తీస్తున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి.. సోమవారం సదరు బ్యాంక్ సీనియర్ ఉద్యోగులను, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను కలిశారు. ఉదయం ఇక్కడ 11 గంటలకు ప్రారంభమైన సమావేశం.. రెండు గంటలకుపైగా జరిగింది. ఈ సందర్భంగా పీఎన్‌బీ పైస్థాయి ఉద్యోగులు తాము తీసుకున్న చర్యల గురించి సీవీసీకి వివరించారు.

కుంభకోణంతో ప్రమేయముందన్న ఆరోపణలపై పలువురు ఉద్యోగులపై యాజమాన్యం తీసుకున్న చర్యలనూ ఈ సందర్భంగా తెలిపారు. అయితే వివిధ రకాల ద్రవ్యవిధాన నిబంధనలు, మార్గదర్శకాలున్నా.. ఇంత భారీ మోసం ఎలా జరిగిందన్న సీవీసీ.. దీనిపై సమగ్ర నివేదికను 10 రోజుల్లో అందివ్వాలని బ్యాంకును ఆదేశించారు. ఇక సీబీఐ అధికారులతోనూ సీవీసీ సమావేశం అవగా, వివిధ స్థాయిల్లో జరిగిన అవినీతి కారణంగానే ఈ కుంభకోణం చోటుచేసుకుందని సీవీసీకి సీబీఐ తెలిపింది. ఈ సమావేశంలో విజిలెన్స్ కమిషనర్ టీఎం భాసిన్ కూడా పాల్గొన్నారు.

ఎల్‌వోయూలపై కట్టుబడి ఉన్నాం: పీఎన్‌బీ

ఎల్‌వోయూలు, ఎఫ్‌ఎల్‌సీల విషయంలో తప్పించుకోవాలని చూడటం లేదని పీఎన్‌బీ స్పష్టం చేసింది. చట్టాలు, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం వీటికి తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ఇతర బ్యాంకులకు ఎల్‌వోయూల కింద చేసిన హామీలను పాటించడంపై పీఎన్‌బీకి ఎలాంటి సూచనలు చేయలేదని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ, ఉద్యోగుల అవినీతి, అంతర్గత వైఫల్యం వల్లే ఇంతటి నష్టం వాటిల్లిందంటూ పీఎన్‌బీ తీరుపై ఆర్బీఐ అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పీఎన్‌బీ సోమవారం పైవిధంగా స్పందించింది.

ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు ఆదేశం

దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న పీఎన్‌బీ కుంభకోణంలో దర్యాప్తు సంస్థల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే ఈ రూ.11,400 కోట్ల మోసం కేసులో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ, సెబీలు విచారణలు చేపడుతుండగా, ఇప్పుడు ఈ జాబితాలోకి తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐవో) కూడా చేరింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు 110 కంపెనీలపై, మరో 10 పరిమిత బాధ్యతాయుత భాగస్వామ్య (ఎల్‌ఎల్‌పీ) సంస్థలపై ఎస్‌ఎఫ్‌ఐవో విచారణకు సోమవారం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ కంపెనీల్లో కొన్ని స్టాక్ మార్కెట్ లిస్టింగ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే వైట్‌కాలర్ నేరాలపై దర్యాప్తు చేసే ఎస్‌ఎఫ్‌ఐవోను.. పలు అక్రమాలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లపైనా విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు కార్పొరేట్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

రూ.5,671 కోట్ల ఆస్తులు జప్తు

పీఎన్‌బీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం ముంబైలోని నీరవ్ మోదీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వొర్లీలోగల సముద్ర మహల్ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్‌లో తనిఖీలు చేపట్టారు. ముంబైతోపాటు పుణె, ఔరంగబాద్, థానే, కోల్‌కతా, ఢిల్లీ, జమ్ము, లక్నో, బెంగళూరు, సూరత్ తదితర నగరాల్లో మొత్తం 38 చోట్ల ఉన్న నీరవ్, ఆయన మేనమామ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ, ఇతరుల ఇండ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా రూ.22 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో నగదు, విలువైన రాళ్లు, బంగారం ఉన్నాయి. మరోవైపు ఇప్పటిదాకా ఈ కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.5,671 కోట్లకు చేరింది. ఇందులో వజ్రాలు, బంగారు ఆభరణాలే అధికంగా ఉన్నాయి. ఇక ఈ కేసును ఈడీ చీఫ్ కర్నల్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పీఎన్‌బీ ఫిర్యాదుతో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. ఇతర స్థిరాస్తులనూ సీజ్ చేసే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నది. కాగా, ఈ నెల 23న ముంబైలోని తమ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ నీరవ్‌తోపాటు చోక్సీకి ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆదాయం పన్ను శాఖ సైతం గీతాంజలి, దాని ప్ర మోటర్ మెహుల్ చోక్సీలకు చెందిన 7 ఆస్తులను జప్తు చేసింది.

సీబీఐ విచారణ వేగవంతం

పీఎన్‌బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) విపుల్ అంబానీని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రశ్నిస్తున్నది. నీరవ్ మోదీ డైమండ్ జువెల్లరీ హౌజ్ ఉన్నతోద్యోగులందరిని కూడా విచారణ చేస్తున్నది. ఇప్పటివరకు 17 మందిని ప్రశ్నించింది. కాగా, విపుల్ మూడేండ్లకుపైగా కాలం నుంచి ఫైర్‌స్టార్‌లోనే పనిచేస్తుండటంతో కంపెనీ ఆర్థిక లావాదేవీల గురించి తప్పక తెలిసి ఉంటుందనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేపడుతున్నది.

పీఎన్‌బీ మోసాలపై సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయగా, జనవరి 31న ఒకటి, అంతకు కొద్దిరోజుల ముందు మరొకటి దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఇద్దరు పీఎన్‌బీ అధికారులను, నీరవ్ మోదీ సంస్థకు చెందిన ఓ అధికారిని సీబీఐ అరెస్టు చేయగా, వారిని విచారిస్తున్నది. మరోవైపు ఈ మోసానికి కేంద్రంగా నిలిచిన ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీహౌజ్ శాఖలో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నది. ఆదివారం సాయంత్రం మొదలైన సోదాలు.. సోమవారం కూడా కొనసాగాయి. అయితే కీలక ఆధారాలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని కొన్ని ఆంక్షలు విధించినట్లు సీబీఐ అధికారులు చెప్పారు.

584
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles