ఆర్థిక ఉద్దీపనలపై గురి

Tue,September 19, 2017 12:44 AM

PM Modi to meet Jaitley officials to review economic situation

-నేడు జైట్లీతో ప్రధాని మోదీ సమావేశం
-దేశ ఆర్థిక పరిస్థితులపై సమీక్ష
-పాల్గొననున్న ఆర్థిక శాఖ కార్యదర్శులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనంపై ఆందోళనకరంగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆర్థిక ఉద్దీపనలపై గురిపెట్టారు. ఇందులో భాగంగానే మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆ శాఖలోని ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు, వృద్ధిరేటు బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా జైట్లీ, ఆర్థిక శాఖ కార్యదర్శులతో మోదీ చర్చించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ జీడీపీ వృద్ధిరేటు మూడేళ్ల కనిష్ఠాన్ని తాకుతూ 5.7 శాతంగా నమోదైన నేపథ్యంలో జీడీపీని తిరిగి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, మార్గాల అన్వేషణపై ఈ సమావేశంలో మోదీ ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గడచిన ఆరు త్రైమాసికాల్లో జీడీపీ క్రమేణా తగ్గుముఖం పట్టడం, నిర్ణీత 7.5 శాతం వృద్ధిరేటును అందుకోవడం కష్టసాధ్యమనే అభిప్రాయం ఆర్థిక సర్వే-2లో వ్యక్తం కావడంపై మోదీలో పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తున్నది.

అంతేగాక ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ ఎగుమతులకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం కూడా మోదీ ఆందోళనను పెంచుతున్నది. పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) సైతం ఇటీవల ఐదేండ్ల కనిష్ఠానికి పతనమైనది తెలిసిందే. మరోవైపు రిటైల్ (చిల్లర) ద్రవ్యోల్బణం, హోల్‌సేల్ (టోకు)ద్రవ్యోల్బణం కూడా పెరుగుతున్నాయి. దీంతో వీటన్నిటిపై మంగళవారం నాటి సమావేశంలో మోదీ సమగ్రంగా చర్చించనున్నారు. దేశంలోకి విదేశీ మారకద్రవ్యం రాకపోకల్లో వ్యత్యాసానికి సూచికైన కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) ఈ ఏప్రిల్-జూన్‌లో నాలుగేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 2.4 శాతానికి పెరగడం, ఎగుమతులు పడిపోయి, దిగుమతులు పెరుగడం వల్ల ఎగిసిన వాణిజ్య లోటుపైనా మోదీ ఈ సందర్భంగా సమావేశంలో జైట్లీ తదితరులతో చర్చించనున్నారు. కాగా, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో తలెత్తుతున్న సమస్యలు, పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎదురవుతున్న పరిణామాలపైనా మోదీ చర్చిస్తారని సమాచారం. ఇదిలావుంటే ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరిగిన ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల వివరాలు, అంచనాలను మోదీకి సంబంధిత అధికారులు సమర్పించే వీలుంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వివరాలనూ మోదీకి ఆయా శాఖల అధికారులు తెలియజేయనున్నారు.

85

More News

VIRAL NEWS