ఆర్థిక వ్యవస్థలో స్థితిగతులపై జైట్లీ సమీక్ష


Wed,September 20, 2017 12:13 AM

ప్రధాని మోదీకి త్వరలో ప్రజెంటేషన్ ఇవ్వనున్న ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశ ఎకానమీలో స్థితిగతులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందులోభాగంగా ఎగుమతులు, మౌలిక రంగంలో ప్రభుత్వం వ్యయం వంటి అంశాలను సైతం ఆయన సమీక్షించారు. రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తోపాటు ప్రధాని మోదీ అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా, ఆర్థిక శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ రోడ్‌మ్యాప్‌పై సమగ్ర నివేదికను రూపొందించే దిశగా సోమవారం కూడా జైట్లీ సమీక్ష నిర్వహించారు. దానికి తరువాయిగానే తాజా సమావేశం. వృద్ధి క్షీణతకు గల కారణాలు, చేపట్టాల్సిన చర్యలపై కొద్ది రోజుల్లో ప్రధాని మోదీకి జైట్లీతోపాటు ఆర్థిక శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

అసలుకైతే మంగళవారం సాయంత్రమే జైట్లీ, సుబ్రమణియన్, ఆర్థిక శాఖ కార్యదర్శులతో మోదీ భేటీ కావాల్సి ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి గల కారణాలు, ఉపశమన చర్యల ప్రతిపాదనలతో కూడిన సమగ్ర నివేదిక తయారీ పూర్తి కానందున ప్రధానితో భేటీ కొద్దిరోజులపాటు వాయిదా పడినట్లు తెలుస్తున్నది. కీలక మంత్రిత్వ శాఖలతో చర్చించి ప్రభుత్వ ఆదాయం, వ్యయాలతోపాటు వృద్ధి పతనాన్ని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలను ప్రతిపాదిస్తూ ఓ నివేదికను తయారు చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఆర్థిక శాఖను కోరింది. రెండేండ్ల క్రితం భారత్.. చైనాను సైతం వెనుకకు నెట్టి ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. కాకపోతే, వరుసగా ఆరు త్రైమాసికాలుగా (సెప్టెంబర్ 2016తో ముగిసిన త్రైమాసికం నుంచి) వృద్ధి క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్ 2017) దేశ జీడీపీ 5.7 శాతానికి క్షీణించింది.

వృద్ధి మందగమనం వాస్తవమే: ఎస్‌బీఐ

ఆర్థిక వ్యవస్థలో మందగమనం వాస్తవమేనని, సాంకేతిక కారణాల వల్ల మాత్రం కాదని ఎస్‌బీఐ రిసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. వృద్ధి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం వ్యయాన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నుంచి ఆర్థిక వ్యవస్థ మందగమంలో కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం వరకూ కొనసాగిన వృద్ధి మందగమనం సాంకేతికంగా చూస్తే స్వల్పకాలికం లేదా అస్థిరమైనది మాత్రం కాదు అని తాజా నివేదికలో ఎస్‌బీఐ రిసెర్చ్ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మందగమనం తాత్కాలికమా..? కాదా..? అన్న భయాందోళనలు పెరిగాయంది. వరుసగా ఆరో త్రైమాసికంలో వృద్ధి పతనమవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పందిస్తూ.. సాంకేతిక కారణాల వల్లేనని పేర్కొన్నారు. అయితే అవేంటనేది మాత్రం ఆయన పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా రిపోర్టు వృద్ధి మందగమనంపై ప్రస్తావించిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

93

More News

VIRAL NEWS