ప్రభుత్వ శాఖల్లో మోసాలను అరికట్టాలి

Fri,November 22, 2019 12:35 AM

-కొత్త సాంకేతిక పద్ధతులను కనిపెట్టండి
-కాగ్‌కు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రభుత్వ శాఖల్లో మోసాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, ఆ దిశగా కొత్త ఆవిష్కరణలను సిద్ధం చేయాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంలో భాగస్వామి కావాలన్నారు. ఈ లక్ష్యంలో ఆడిటర్ల పాత్ర కీలకమని గుర్తుచేశారు. గురువారం ఇక్కడ కాగ్ ప్రధాన కార్యాలయంలో ఆడిటింగ్ మార్పులు-డిజిటల్ ప్రపంచంలో భరోసాపై జరిగిన సదస్సులో అకౌంటెంట్ జనరల్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. వృత్తిరిత్యా మోసాలను అణిచివేసేందుకు ప్రభావవంతమైన పద్ధతులను అవలంభించాలని కోరారు. 2022 నాటికి పాలనలో భాగంగా రుజువుల ఆధారిత విధానాలను తీసుకురావాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు చెప్పారు. కాగ్ నిర్ణయాలు ప్రభుత్వాలపైనేగాక, అన్ని వ్యవస్థలపైనా ప్రభావం చూపుతాయన్న ఆయన అవినీతి రహిత సమాజ నిర్మాణానికి మరింత కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల సామర్థ్యం పెరుగాలని చెప్పారు.

డిజిటలైజేషన్ పెరుగాలి

డిజిటల్ గణన, డిజిటల్ పాలనలతో చాలా సంస్థలు సంస్థాగతంగా బలపడుతాయని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆడిటింగ్ సంస్థలు క్రౌడ్ ఆధారిత సొల్యూషన్స్ దిశగా వెళ్తున్నాయని చెప్పారు. కాగ్ సైతం అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విధానాలను అవలంభించాలని కోరారు. కాగ్.. పలు అంతర్జాతీయ సంస్థలను ఆడిట్ చేసింది. ఇతర దేశాలకూ సాంకేతికంగా మద్దతునిచ్చింది. ఇందుకు కారణమైన బృందాలతో ఓ సంస్థాగత వ్యవస్థను కాగ్ ఏర్పాటు చేయవచ్చు. వారి అనుభవాలను ఉపయోగించుకుని ఇంకా మంచి ఫలితాలను సాధించవచ్చు అని సూచించారు. ఈ క్రమంలోనే అంతర్గత, బాహ్య ఆడిటర్లు మోసాలను కనిపెట్టే కొత్త పద్ధతులను కనుగొనాలి అన్నారు. ప్రభుత్వ విధానాలు, దేశంలో పెట్టుబడులు, వర్తక-వాణిజ్యాలు, సులభతర వ్యాపార నిర్వహణ, సంస్కరణలు, నిర్ణయాల్లో ఆడిటింగ్‌దే ప్రధాన పాత్రన్నారు. ఓ ఆడిటర్ కోణంలో కాకుండా ఓ మేధావి కోణంలో కాగ్ ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. అంతకుముందు కాగ్ కాంప్లెక్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles