దిగొచ్చిన మాల్యా

Thu,December 6, 2018 01:19 AM

Please take it Vijay Mallya offers to repay 100 Percentage to banks

-రుణాలు తిరిగి చెల్లిస్తా బ్యాంకులకు విజ్ఞప్తి
లండన్, డిసెంబర్ 5: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎట్టకేలకు దిగొచ్చారు. బ్యాంకుల వద్ద తీసుకున్న ప్రజల సొమ్మును 100 శాతం తిరిగి బ్యాంకులకు చెల్లించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా భారత్ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాల్యాను భారత్‌కు అప్పగించేదానిపై బ్రిటన్ కోర్టు త్వరలో తీసుకోనున్న నిర్ణయానికి ముందే మాల్యా నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం విశేషం. 62 ఏండ్ల వయస్సు కలిగిన కింగ్‌ఫిష్ ఎయిర్‌లైన్స్ యజమాని గతేడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన బెయిల్‌పై బ్రిటన్‌లో నివసిస్తున్నారు. దేశీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఆయనపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. మాల్యాకు వ్యతిరేకంగా నమోదైన కేసుపై ఈ నెల 10న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలవరించనున్నది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మాల్యా..బ్యాంకులతో భేరసారాలకు సిద్ధమయ్యారు. చాలా కీలకమైన అంశం ప్రజల సొమ్మును 100 శాతం తిరిగి చెల్లింపులు జరుపడానికి సిద్ధంగా ఉన్నా..బ్యాంకులకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే దీనిని తిరస్కరించకండి అని ట్విట్టర్‌లో వరుసగా పోస్ట్‌చేశారు. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని పారిపోయానని, పలువురు రాజకీయ నాయకులు, మీడియా దుమ్మెత్తిపోయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది అబద్ధం..2016 నుంచి బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అప్పుట్లోనే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ వల్లనే బ్యాంకులకు తిరిగి చెల్లింపులు జరుపలేకపోయానని, ముఖ్యంగా ఆ సమయంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లు పలుకడంతో తీవ్ర ఇబ్బందులను గురైనట్లు, బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను సైతం పొగొట్టుకున్నప్పటికీ 100 శాతం తిరిగి వారికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత్‌లో అతిపెద్ద మద్యం తయారీ సంస్థల్లో ఒకటైన కింగ్‌ఫిషర్‌తో కేంద్రానికి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లించినట్లు చెప్పుకొచ్చారు. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ ఒప్పందంలో జరిగిన అవకతవకలపై క్రిస్టియన్ మైకెల్‌ను భారత్‌కు రప్పించిన కొద్ది గంటల్లోనే మాల్యా ఇలా స్పందించడం విశేషం. మరోవైపు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను భారత్‌కు రప్పించడానికి కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతేడాది నుంచి లండన్‌లో తలదాచుకున్న మాల్యాను కూడా తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపింది.

2049
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles