మళ్లీ పెట్రోపోటు

Sat,January 12, 2019 12:17 AM

Petrol price hiked by 19 paise diesel by 28 paise

- లీటర్ పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌పై 28 పైసల వడ్డన
న్యూఢిల్లీ, జనవరి 11: సామాన్యుడిపై మళ్లీ పెట్రోల్ పోటు పడింది. గడిచిన రెండు నెలలుగా ఊరటనిస్తూ ధరలు తగ్గించిన ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు మళ్లీ ధరలను పెంచడం ప్రారంభించాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం లీటర్ పెట్రోల్‌పై 19 పైసలు పెంచిన సంస్థలు..డీజిల్‌పై 28 పైసలు వడ్డీంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.69.07కి చేరుకున్నది. ప్రస్తుత నెలలో ఇదే గరిష్ఠ స్థాయి. గురువారం రూ.68.88గా ఉన్న ధర ఆమరుసటి రోజు రూ.69 దాటిందని ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వెల్లడించింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.62.53 నుంచి రూ.62.81కి చేరుకున్నది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న స్థానిక పన్ను, వ్యాట్ ఆధారంగా ఆయా ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంట్లోభాగంగా ముంబైలో పెట్రోల్ రూ.74.72కి చేరుకోగా, డీజిల్ రూ.65.73 పలికింది. హైదరాబాద్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ 20 పైసలు పెరిగి రూ.73.27కి చేరింది.

డీజిల్ మరో 30 పైసలు అందుకొని రూ.68.28కి చేరుకున్నది. నూతన సంవత్సరం తొలి నెలలో ఇలా ధరలు పెరుగడం ఇది మూడోసారి. గురువారం పెట్రోల్ 38 పైసలు పెరుగగా, డీజిల్ 29 పైసలు అందుకున్నది. ఈ నెల 7న 21 పైసలు పెరిగిన పెట్రోల్, డీజిల్ 8 పైసలు ఎగబాకింది. వరుసగా మూడుసార్లు పెంచడంతో పెట్రోల్ ధర 78 పైసలు, అదే డీజిల్ 55 పైసలు అధికమైనట్లు అయింది. అక్టోబర్ 18, 2018 తర్వాత తగ్గుముఖం పట్టిన ధరలు ఒకదశలో ఏడాది కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. ఈ మూడు నెలల్లోనే పెట్రోల్ రూ.14.54 తగ్గగా, అదే డీజిల్ రూ.13.53 తగ్గినట్లు అయింది. కాగా, ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 4 వరకు పెట్రోల్ రూ.6.86 పెరుగగా, డీజిల్ రూ.6.73 పెరిగాయి.

3802
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles