పెట్రో హైఅలర్ట్‌!

Tue,September 17, 2019 12:55 AM

- సౌదీ చమురు క్షేత్రాలపై దాడుల ప్రభావం
- లీటర్‌ రూ.5-6 మేర పెరిగే అవకాశం
- ఒక్కరోజే 20 శాతం ఎగిసిన బ్యారెల్‌ క్రూడ్‌ ధర
- ధరల పెంపుపై సంకేతాలిచ్చిన హెచ్‌పీసీఎల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 16: దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగనున్నాయి. లీటర్‌ ధర రూ.5-6 వరకు ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు రిఫైనరీపై జరిగిన డ్రోన్‌ దాడులే ఇందుకు కారణం. ఈ దాడులతో సౌదీ చమురు ఉత్పత్తి దాదాపు సగం నిలిచిపోగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కసారిగా ముడి చమురు సరఫరా ప్రభావితమైంది. ఈ పరిణామం బ్యారెల్‌ క్రూడ్‌ ధరలకు రెక్కలు తొడుగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ఆరామ్కో ఆయిల్‌ రిఫైనరీపై శనివారం డ్రోన్ల సాయంతో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్‌ ఆధారిత హౌతీ ఉగ్రవాదులు రెండు రిఫైనరీలపై ఈ దాడులకు తెగబడగా, రోజుకు 5.7 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు సౌదీ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తం ప్రపంచ క్రూడ్‌ సరఫరాలో 5 శాతానికి సమానం కావడం గమనార్హం.

అంతర్జాతీయ విపణిలో ధరల సరళి ఇలాగే ఉంటే రిటైల్‌ ఔట్‌లెట్లలో ధరలు పెరుగడం ఖాయమని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్ప్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) చైర్మన్‌ ఎంకే సురానా న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌తో అన్నారు. దీంతో వినియోగదారులపై లీటర్‌కు రూ.5-6 మేర భారం పడవచ్చన్న అభిప్రాయాలు పరిశ్రమ నుంచి వ్యక్తమవుతున్నాయి. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో గడిచిన 15 రోజుల పెట్రోల్‌, డీజిల్‌ ధరల సగటు ప్రామాణిక రేటు ఆధారంగా భారతీయ మార్కెట్‌లో ఇంధన ధరలను చమురు విక్రయ సంస్థలు మారుస్తూంటాయి. సోమవారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.72.03గా, డీజిల్‌ ధర రూ.65.43గా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.76.57, డీజిల్‌ రూ.71.33గా నమోదైయ్యాయి.

సరఫరాకు ఢోకా లేదు: ప్రధాన్‌

సౌదీ రిఫైనరీలపై దాడుల నేపథ్యంలో భారత్‌కు ముడి చమురు సరఫరాలో వచ్చే ఇబ్బందులేమీ ఉండబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ మేరకు సౌదీ అరేబియా నుంచి భారత్‌కు హామీ లభించిందని ఆయన చెప్పారు. ‘ఈ నెలకుగాను ముడి చమురు సరఫరాపై మా చమురు మార్కెటింగ్‌ సంస్థ (ఓఎంసీ)లతో సమీక్ష నిర్వహించాం. భారత్‌కు సరఫరా తగ్గదని మేము నమ్మకంగా ఉన్నాం. అయినా మొత్తం పరిస్థితులను చాలా దగ్గరగా గమనిస్తున్నాం’ అని దాడులకు గురైన రిఫైనరీల సంస్థ ఆరామ్కో ఉన్నత వర్గాలు చెప్పినట్లు ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. ఇరాక్‌ తర్వాత సౌదీ నుంచే అత్యధికంగా ముడి చమురును భారత్‌ కొనుగోలు చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) భారత్‌కు 207.3 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతులు జరుగగా, సౌదీ వాటా 40.33 మిలియన్‌ టన్నులుగా ఉన్నది.

50 కోట్ల భారం: ఎయిర్‌ ఇండియా

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాపై ప్రతి నెల రూ.50 కోట్ల అదనపు భారం పడనున్నది. ప్రస్తుతం నెలకు రూ.500 కోట్ల చెల్లింపులు జరుపుతున్న సంస్థ.. ఈ నూతన ధరలతో కనీసంగా మరో రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్‌ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఒక దశలో 20 శాతానికి పైగా పెరిగింది. ఇలాగే ధరలు పెరిగితే తప్పనిసరిగా విమాన టిక్కెట్టు ధరలు పెంచాల్సి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.

మళ్లీ బ్యారెల్‌ ధర 80 డాలర్లకు

దాడుల నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర 80 డాలర్లను తాకవచ్చని ఎస్‌అండ్‌పీ అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ఒక్కరోజే పీపా క్రూడ్‌ ధర 19.5 శాతం ఎగిసి ఒకానొక దశలో 71.95 డాలర్లను చేరింది. గడిచిన 28 ఏండ్లలో ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు మరెప్పుడూ లేవు. ట్రేడింగ్‌ ఆఖర్లలో 66 డాలర్ల దరిదాపుల్లోకి వచ్చినా.. ఈ ఒడిదుడుకులు మాత్రం మార్కెట్‌లో ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. శుక్రవారం బ్యారెల్‌ క్రూడ్‌ ధర 60.52 డాలర్ల వద్దే ముగిసింది. శనివారం దాడుల నేపథ్యంలో సోమవారం దాదాపు 6 డాలర్లదాకా ఎగబాకింది. దీంతో త్వరలో 80 డాలర్లను తాకవచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దాడుల కారణంగా నిలిచిపోయిన ఉత్పాదక కేంద్రాలను త్వరగానే సౌదీ అరేబియా ప్రారంభించగలదని, అయితే పూర్తిస్థాయిలో అక్కడ ఉత్పత్తి పుంజుకోవడానికి మాత్రం సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం మూడో వంతు ఉత్పత్తిని అందుకోగలిగామన్న ధీమా సౌదీ నుంచి వ్యక్తమైనా.. విశ్లేషకుల అంచనాలు మాత్రం చమురు దిగుమతి దారుల్లో గుబులు
పుట్టిస్తున్నాయి.

భారత్‌కు దెబ్బ

పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారవుతున్నది భారత్‌ పరిస్థితి. అసలే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను సౌదీ దాడుల నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలు మరింత కుంగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. చమురు దిగుమతిదారుల్లో ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానంలో ఉన్నది. మరోవైపు చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియానే వరల్డ్‌ టాప్‌. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్‌ క్రూడ్‌ మార్కెట్‌కు సౌదీ అరేబియానే పెద్ద దిక్కు అవగా, ఇప్పుడు ఆ దేశ రిఫైనరీలపై జరిగిన దాడులు అటు గ్లోబల్‌ మార్కెట్‌ను.. ఇటు భారతీయ మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం మరో 70 పైసలు పతనమై 71.62 వద్ద నిలిచింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగే క్రూడ్‌ ధరలు.. దేశీయ వాణిజ్య లోటు, ద్రవ్యలోటులను, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనున్నాయి. ఇదే జరిగితే ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలకు బ్రేకులు తప్పవు. దాంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు నిధుల కొరత, వడ్డీ రేట్ల భారమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles